తెలంగాణ

telangana

అప్పుడు పదో తరగతిలో స్టేట్​ ర్యాంకర్​... ఇప్పుడు మంత్రి

By

Published : Jul 22, 2020, 7:59 PM IST

ఏపీ రాష్ట్ర మంత్రిగా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లకే సీదిరికి మంత్రి పదవి వరించింది. 1995లో పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి నాటి సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రతిభా అవార్డును అందుకున్నారు.

these-are-the-education-details-of-sidiri-appalaraju
అప్పుడు పదో తరగతిలో స్టేట్​ ర్యాంకర్​... ఇప్పుడు మంత్రి

ఆంద్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పలాస శాసన సభ్యుడు డా.సీదిరి అప్పలరాజు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రిగా రాజ్‌భవన్‌లో బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు.

నమ్మకమే కారణం

ఏపీముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి డా.అప్పలరాజుపై ఉన్న నమ్మకమే మంత్రి పదవి వరకు తీసుకొచ్చింది. అధినేత తనకు ఏ పని అప్పజెప్పినా తూ.చ.తప్పకుండా పాటించారు. ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లి ఎమ్మెల్యేగా ఏడాదిలో నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి పనులు మంజూరు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదలతో విజయాల సాధనలో భాగంగా వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. చివరకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పదో తరగతిలో స్టేట్‌ ర్యాంకర్‌
1995లో పదోతరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి నాటి సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రతిభా అవార్డును అందుకున్నారు డా.సీదిరి అప్పలరాజు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ చదివి, ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. అప్పలరాజు 2007లో ఆంధ్రా వైద్య కళాశాల నుంచి జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ పట్టా అందుకున్నారు. అక్కడే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం గత 12 ఏళ్లుగా కాశీబుగ్గలో వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. 2017 ఏప్రిల్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వెంటనే పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మహిళా శిశు సంక్షేమశాఖ శాసనసభా కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు : బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details