తెలంగాణ

telangana

ETV Bharat / city

పూల దుఃఖం: సంక్రాంతి వేళ కళతప్పిన పూల మార్కెట్లు! - సంక్రాంతి వార్తలు

సంక్రాంతి వేళ... పూల మార్కెట్‌ కళతప్పింది. కొవిడ్ నేపథ్యంలో కుదేలైన పూలు ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న దశలో మార్కెట్‌లో పూల ధరలు పడిపోయాయి. నిన్న, మొన్నా ధరలు ఫర్వాలేదనకుంటే మరక సంక్రాంతి పండుగ రోజు వినియోగదారులు లేకపోవడంతో మార్కెట్ బోసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో... ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో అసలు ఇవాళ పూలు ధరలు బాగా ఉంటాయనుకున్న రైతులు, వ్యాపారులకు పూర్తి నిరుత్సాహమే మిగిలింది.

flower market
flower market

By

Published : Jan 14, 2021, 10:21 PM IST

తెలుగు రాష్ట్రాల్లో పూల మార్కెట్‌ కళతప్పింది. మకర సంక్రాంతి పర్వదినం వేళ మార్కెట్లన్నీ బోసిపోయాయి. పూల కొనుగోళ్లు పెద్దగా కనిపించలేదు. భోగి, మకర సంక్రాంతి పండుగకు ముందు రెండు రోజులు ఒకింత ఆశాజనంగా ఉన్నప్పటికీ... ఈరోజు పూల మార్కెట్లలో సందడి లేదు. కొనుగోళ్లు పెద్దగా లేకపోవడం, ధరలు భారీగా పడిపోవడంతో... అమ్ముకుందామని వచ్చిన రైతులకు నిరుత్సాహం మిగిలింది. కొవిడ్-19 నేపథ్యంలో... ఆరంభంలో లాక్‌డౌన్ ఆంక్షలు పూల రైతులపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థికంగా నష్టపోయారు.

కూలీ ఖర్చు కూడా రాని పరిస్థితి

భారీ వర్షాలు, వరదలు పోటెత్తడంతో అలంకరణ పూల పంటలు దెబ్బతినడం వల్ల... రైతులు కొత్తగా పంటల సాగుకు మొగ్గు చూపలేదు. ఉద్యానశాఖ కూడా చేతులెత్తేయడంతో దిక్కుతోచని పూల రైతులు... సొంతంగా పెట్టుబడులు పెట్టి పలు రకాల పూల తోటలు సాగు చేశారు. ఎంతో ఆశతో ఉత్పత్తులు తీసుకుని మార్కెట్‌కు వస్తే సరైన ధరలు లేకపోవడం వల్ల కనీసం కూలీ ఖర్చులు చేతికొచ్చే పరిస్థితి లేదని పూల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాగు విస్తీర్ణం తగ్గింది

ఒక్క మల్లెపూలు కిలో రూ.400 మినహా... మిగతా బంతి కిలో రూ.20 నుంచి రూ.30, చేమంతి రూ.50, గులాబీ రూ.60 మించి లేవని రైతులు వాపోయారు. కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూలసాగు విస్తీర్ణం తగ్గిపోయింది. పెట్టుబడుల భారం ఫలితంగా సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మార్కెట్‌లకు పెద్ద ఎత్తున పూలు దిగుమతి అవడం వల్ల స్థానిక రైతులకు మద్దతు ధరలు లభించడం కష్టంగా మారింది. అతి పెద్ద పూల మార్కెట్‌ గుడిమల్కాపూర్‌లో బేరాలు పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదని పూల వర్తకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిక్కుతోచని స్థితిలో రైతులు

మరో మూడు మాసాలపాటు మూడాలు ఉండటం, ముహూర్తాలు లేకపోవడంతో... ఇంకా తోటల్లో ఉన్న పూల ఉత్పత్తులు ఎలా అమ్ముకోవాలన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. పూల పంటల సాగు పూర్తిగా నష్టాలు మిగిల్చిందని, ఇతర పంటల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇదీ చదవండి :అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details