తెలంగాణ

telangana

ETV Bharat / city

నలుగురు అమాత్యుల పరిధిలో అభ్యర్థులకు తప్పని ఓటమి - జీహెచ్ఎంసీ రిజల్ట్స్​ 2020

గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలను ఒక్కో డివిజన్‌కు ఇన్‌ఛార్జులుగా నియమించి పక్కాగా ప్రచారం నిర్వహించినా తెరాస ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయింది. మొత్తం 150 డివిజన్లకు మంత్రులు సహా ఇతర పార్టీ ముఖ్య నేతలందరినీ తెరాస నియమించింది. వారికి కేటాయించిన డివిజన్లలో పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పనిచేసినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. నలుగురు మంత్రులకు కేటాయించిన డివిజన్లలో అధికార పార్టీ ఓటమి పాలైంది. తమకు అప్పగించిన డివిజన్లలో భాజపా విజయాన్ని అడ్డుకోవడంలో నలుగురు మంత్రులు సఫలం కాలేకపోయారు. అక్కడ తెరాస రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నలుగురు అమాత్యుల పరిధిలో అభ్యర్థులకు తప్పని ఓటమి
నలుగురు అమాత్యుల పరిధిలో అభ్యర్థులకు తప్పని ఓటమి

By

Published : Dec 5, 2020, 7:11 AM IST

గత బల్దియా ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుని తెరాస చరిత్ర సృష్టించింది. తాజా పరిమాణాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలుపు బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలపైనే వదిలేయకుండా ఒక్కో డివిజన్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించింది. ఈ జాబితాలో 13 మంది మంత్రులున్నారు. గెలిస్తే సరి.. లేదంటే ఆ ప్రభావం తమపై పడుతుందనే ఉద్దేశంతో వారు తమ డివిజన్‌ అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. స్వస్థలాల నుంచి భారీగా అనుచరుల్ని రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయారు.

అక్కడ ఓటమి..

  • సరూర్‌నగర్‌ డివిజన్‌కు విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించగా తెరాస అభ్యర్థి పి.అనితా దయాకర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ భాజపా గెలుపొందింది.
  • మంత్రి ఈటల రాజేందర్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మల్కాజిగిరిలో హోరాహోరీ పోరులో భాజపా 70 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది.
  • హిమాయత్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతలు మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. ఇక్కడ సిటింగ్‌ కార్పొరేటర్‌ హేమలతాయాదవ్‌ ఓటమి పాలవ్వగా భాజపా జయకేతనం ఎగరేసింది.
  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అడిక్‌మెట్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జిగా నియమించగా తెరాస పార్టీని గెలిపించలేకపోయారు.

వీరు గెలిపించారు...

  • చిలుకానగర్‌ డివిజన్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. గీతా ప్రవీణ్‌కు ఆమె టికెట్‌ ఇప్పించారు. ఇక్కడ తెరాస- భాజపాల మధ్య హోరాహోరీ పోరులో తెరాస విజయం సాధించింది.
  • మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో తెరాస అభ్యర్థి ప్రభుదాస్‌ గెలుపొందారు.
  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బంజారాహిల్స్‌ డివిజన్‌ గెలుపు బాధ్యతను తీసుకున్నారు. ఇక్కడ తెరాస ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి విజయం సాధించారు.
  • మంత్రి కేటీఆర్‌ హైదర్‌నగర్‌ డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయబావుటా ఎగరేశారు.
  • గాజులరామారం డివిజన్‌ బాధ్యుడిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యవహరించగా తెరాస అభ్యర్థి రావుల శేషగిరి విజయం సాధించారు.
  • మంత్రి మల్లారెడ్డి రంగారెడ్డినగర్‌ డివిజన్‌ బాధ్యుడిగా ఉన్నారు. ఇక్కడ తెరాస తరఫున బరిలోకి దిగిన బి.విజయ్‌శేఖర్‌ గౌడ్‌ జయపతాక ఎగరేశారు.
  • వెంకటాపురం డివిజన్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించి తెరాస అభ్యర్థి సబితా కిశోర్‌ను గెలిపించారు.
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్న అంబర్‌పేటలో తెరాస అభ్యర్థి విజయ్‌కుమార్‌ గౌడ్‌ విజయం సాధించారు.
  • కేపీహెచ్‌బీ డివిజన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ గెలుపు బాధ్యతను తీసుకోగా తెరాస అభ్యర్థి శ్రీనివాసరావు గెలుపొందారు.

‘పటాన్‌చెరు’.. హరీశ్‌ జోరు!

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం, పటాన్‌చెరు, భారతీనగర్‌ డివిజన్లలో తెరాస అభ్యర్థుల గెలుపు బాధ్యతను హరీశ్‌రావు తీసుకున్నారు. ప్రతి వంద మంది ఓటర్లను బూత్‌ దగ్గరకు తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యతను ఒక్కో నాయకుడికి అప్పగించారు. పార్టీ తరఫున ప్రతి ఇంటికి ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశం అందేలా చూశారు. మూడు డివిజన్లలో పెద్దఎత్తున రోడ్డుషోలు నిర్వహించడంతోపాటు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గెలిచిన అభ్యర్థుల తరఫున తాను డివిజన్ల సమస్యలను తీరుస్తానంటూ హామీలు ఇచ్చారు. ఇలా హరీశ్‌రావు మంత్రాంగం ఫలించడంతోనే తనకు అప్పగించిన పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మూడు డివిజన్లలోనూ తెరాస అభ్యర్థులు విజయం సాధించారని పార్టీ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ మూడు చోట్ల భాజపా అభ్యర్థులను ఓడించి, దుబ్బాకలో ఓటమికి మంత్రి ప్రతీకారం తీర్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవీ చూడండి:గ్రేటర్ ఎన్నికల్లో తల్లిని ఓడించిన తనయుడు...

ABOUT THE AUTHOR

...view details