అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు తాలిబన్లు. అఫ్గాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు. మొహమ్మద్ మౌల్వీ సర్దార్ జద్రాన్ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు.
ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసిన తాలిబన్లు.. దేశంపై నియంత్రణ సాధించిన తరువాత పలువురు మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి మహిళా గవర్నర్గా ఎన్నికైన సలీమా మజారీని సైతం అదుపులోకి తీసుకున్నారు. చాలా మంది అఫ్గానిస్థాన్ రాజకీయ నాయకులు దేశం విడిచి వెళ్లినా.. సలీమా మజారీ బాల్ఖ్ ప్రావిన్స్ లొంగిపోయే వరకు తాలిబన్లకు ఎదురునిలిచారు. ఆమె సొంత జిల్లా చాహర్ కింట్ తాలిబాన్ వశమైంది.