తెలంగాణ

telangana

ETV Bharat / city

లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై జీహెచ్‌ఎంసీ కసరత్తు - హైదరాబాద్ వార్తలు

పేదల ఆశల సౌధం.. రెండు పడకల ఇళ్లను ఎవరికి ఇవ్వాలనే అంశంపై కదలిక వచ్చింది. గృహ నిర్మాణశాఖ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్‌ పరిధిలో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుతో పాటు ఓటరు జాబితాలో చోటున్న వారినే ఎంపిక చేసేలా నిబంధనలు రూపుదిద్దుకున్నాయి. వాటి ఆధారంగా దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ టీఎస్‌టీఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవలు)లో ఇప్పటికే మొదలైంది.

houses for allectiong in ghmc people
లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై జీహెచ్‌ఎంసీ కసరత్తు

By

Published : Jan 29, 2021, 7:53 AM IST

పది రోజుల్లో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అర్హుల జాబితా సిద్ధం కానుంది. ప్రభుత్వం ఆదేశించినప్పుడు కంప్యూటర్‌ లాటరీతో అర్హుల పేర్ల నుంచి ఎంపిక చేస్తారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎలాంటి కోటా ఉండదని, ఆ పేరుతో దళారులు అమాయకులను మోసం చేస్తున్నారని అధికారులు అన్నారు. సగటున ఒక్కో నియోజకవర్గం నుంచి 4వేల మంది లబ్ధిదారులు ఎంపికకానున్నారు.

  • లక్ష ఇళ్లలో ఇప్పటికే 30వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలిన ఇళ్లు వేర్వేరు దశల్లో ఉన్నాయి. మురికివాడల ఆధునికీకరణ పథకంలో భాగంగా.. స్థానికులకే అక్కడ నిర్మిస్తోన్న ఇళ్లను కేటాయిస్తున్నారు. మిగిలిన ఇళ్లను లాటరీ విధానంలోకి మళ్లిస్తారు.
  • మీసేవా కేంద్రాలు, జిల్లా కలెక్టర్లకు అందిన 6లక్షల దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆధ్వర్యంలో టీఎస్‌టీఎస్‌ పరిశీలిస్తోంది.
  • ఇవీ మార్గదర్శకాలు..
  • 2018 శాసనసభ ఓటరు జాబితాలో పేరుండాలి. స్థానిక చిరునామాతో ఆధార్‌, రేషన్‌కార్డు, చిరునామా ధ్రువపత్రం ఉండాలి
  • గ్రామీణ, పట్టణ గృహాలు, ఇందిరమ్మ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, ఐహెచ్‌ఎస్‌డీపీ, వాంబే, ఆర్‌జీకే, ఇతరత్రా పథకాల కింద గతంలో లబ్ధి పొందినవారు..అలానే జీవో 58, 59 లబ్ధిదారులు అనర్హులు.
  • గ్రేటర్‌లోని 24 శాసనసభ స్థానాలతో సంబంధంలేని నియోజకవర్గాల్లోనూ ఇళ్లు నిర్మాణమయ్యాయి. ఆయా చోట్ల.. 10 శాతం(1000 ఇళ్లకు మించకుండా) స్థానిక నియోజకవర్గానికి కేటాయిస్తారు.
  • నియోజకవర్గాల వారీగా కులం, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్ల ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నగరాన్ని తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర క్లస్టర్లుగా విభజించి, వాటి పరిధిలోని నియోజకవర్గాలకు అక్కడున్న నిర్మాణ సముదాయాల్లో ఇళ్లు కేటాయించేలా మ్యాపింగ్‌ చేశామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details