Bathukamma sarees distribution: రాష్ట్ర సంస్కతి సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేప్టటింది. ఇప్పటికే వేడుకలు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న సర్కారు... ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి చీరల పంపిణి చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తంగా జరువుకోవటం అందరికీ గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో మంత్రి బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. దేశానికి సారథిగా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన పలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెరాస ప్రజలతోనే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలో... 22లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన భాజపా.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని కవిత ప్రశ్నించారు. ఉద్యోగ ప్రకటన కోసం ఎంపీలు, ప్రధానిని నిలదీయాలన్నారు. కొందరు ప్రజలను విడగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆమె.. వారికి గట్టిగా సమాధానం చెప్పాలని సూచించారు.