Minister Sabitha Indra Reddy: ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి... తర్వాత పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదోన్నతులపై ఆమె గురువారం తన కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. నూతన జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన... యాజమాన్యాల వారీగా హెచ్‌ఎంల స్థాయి వరకు బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎంఈవో, డిప్యూటీ ఈవో పదోన్నతులను మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి ఎస్‌జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరస్పర బదిలీల దస్త్రాన్ని సాధారణ పరిపాలనశాఖకు పంపామని, మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పినట్లు సంఘాల నాయకులు తెలిపారు.
మరికొన్ని నిర్ణయాలు.. చర్చించిన అంశాలు..
* వచ్చే విద్యాసంవత్సరం (2022-23) ప్రవేశాలు ముగిసిన తర్వాతే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడతారు.
* ఉపాధ్యాయులకు ప్రధాన అడ్డంకి భాషా పండితులు, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణే అని,
* ఆ విషయం హైకోర్టులో ఉన్నందున దాన్ని త్వరగా ముగించాలని నిర్ణయించారు.