తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇలాగైతే తీవ్రంగా నష్టపోతాం.. రైస్‌ మిల్లర్ల సంఘం ఆవేదన - రైస్‌ మిల్లర్ల సంఘం ఆవేదన

తెలంగాణలో 45 రోజులుగా బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేయటం దురదృష్టకరమని దక్షిణాది రాష్ట్రాల రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్‌ అన్నారు. రాజకీయ వైషమ్యాలకు పరిశ్రమను ఇబ్బంది పెట్టొద్దన్నారు. వెంటనే కేంద్రం బియ్యం సేకరణ చేపట్టాలని కోరారు.

rice millers
rice millers

By

Published : Jul 16, 2022, 8:17 AM IST

‘గతంలో ఎన్నడూ లేనివిధంగా 45 రోజులుగా కేంద్రం తెలంగాణలో బియ్యం సేకరణను నిలిపివేసింది. మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. వర్షాలకు భారీగా తడిసిపోతున్నాయి. నిలిపివేసిన ధాన్యం సేకరణను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందించడంలేదు. ఇలాగైతే మేం తీవ్రంగా నష్టపోతాం. పరిస్థితి ఇలానే కొనసాగితే మిల్లర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి బియ్యం సేకరణ చేపట్టాలి. కేంద్రాన్ని ఒప్పించి బియ్యం సేకరణ ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లను కోరాం. పునరుద్ధరణ ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పినా ఇప్పటివరకూ రాలేదు’ అని దక్షిణాది రాష్ట్రాల రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

‘తెలంగాణలో 45 రోజులుగా బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేయటం దురదృష్టకరం. ఇక్కడి మిల్లుల్లో పనిచేసే బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. భారీ వర్షాలతో ఆరుబయట నిల్వ చేసిన 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసిపోయింది. బియ్యానికి పురుగు పడుతోంది. ఉప్పుడుబియ్యం గడ్డకడుతోంది. కేంద్రం ఆంక్షలు లేకుండా బియ్యాన్ని తీసుకోవాలి. లక్షల కుటుంబాలు రైస్‌మిల్లు పరిశ్రమపై ఆధారపడ్డాయి. తక్షణం బియ్యం సేకరణను పునరుద్ధరించకపోతే అవి రోడ్డున పడక తప్పదు’ అని దేవేందర్‌రెడ్డి, నాగేందర్‌లు పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పటోళ్ల వెంకట్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నీలా సత్యనారాయణ పాల్గొన్నారు.

భాజపా ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించాలి.. రైస్‌మిల్లుల్లో 94 లక్షల టన్నుల ధాన్యం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నామని రైస్‌మిల్లర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై భాజపా ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details