Ap cabinet meeting: కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమ్మఒడితోపాటు 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జులైలో మరో నాలుగు పథకాల అమలుకు అంగీకారం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం సుమారు మూడు గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 13 పాత జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న జడ్పీ ఛైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగించాలని కేబినెట్ తీర్మానించిందన్నారు. జిల్లాల విభజనకు సంబంధించిన సవరణలు, మార్పులు, చేర్పులతో కూడిన తుది నోటిఫికేషన్‌కు ఆమోదం లభించిందన్నారు. ఎంఐజీ లేఅవుట్లలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి, ఇప్పటికే ఉన్న భూసేకరణ విధానాలకు అదనంగా మరో కొత్త విధానం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు.
43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి:'జగనన్న అమ్మఒడి పథకంతో 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూరుతుంది. వీరిలో బీసీలు 54%, ఎస్సీలు 21%, ఎస్టీలు 6%, ఓసీలు 19% మంది చొప్పున ఉన్నారు. ఈ ఏడాది అమ్మఒడి కింద రూ.6,594.06 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కొత్తగా 5,48,329 మంది తల్లులకు అవకాశం లభించింది. మొత్తంగా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ఆక్వా రైతులకు ప్రస్తుతం అయిదు ఎకరాల వరకు ఇస్తున్న విద్యుత్తు రాయితీని పదెకరాల వరకు పెంచాం. ఇకపై ప్రతి యూనిట్ విద్యుత్తుకు రూ.1.50 చెల్లిస్తే సరిపోతుంది. పది ఎకరాలకు పైబడి సాగు చేస్తున్న రైతులు యూనిట్‌కు రూ.3.80 చెల్లించాలి. బైజూస్ కంటెంట్‌ను నాలుగో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ఈ ఏడాది 8వ తరగతిలోకి ప్రవేశించే 4.7 లక్షల మందికి ట్యాబ్‌లు ఇవ్వనున్నాం' అని మంత్రి వివరించారు.
ఆన్‌లైన్ టికెట్లపై వివాదం లేదు:'ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవహారంలో ఎటువంటి వివాదం లేదు. థియేటర్ యాజమాన్యాలు, ప్రజలూ ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కొన్ని సంస్థలతో జరిగిన ఒప్పందాలతో తలెత్తిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా చలనచిత్రాల షూటింగులు చేసుకోవచ్చు' అని మంత్రి తెలిపారు.