Bopparaju On Employees Protest: తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 71 అంశాలపై కూలంకషంగా చర్చించామని చెప్పారు. ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పిందన్న ఆయన.. ప్రభుత్వ హామీతో ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదని పేర్కొన్నారు. ఇవాళ్టి భేటీ మినిట్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈ నెల 7 నుంచి ఉద్యోగులంతా ఆందోళనలో ఉన్నారని ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది..
మా సమస్యలపై ప్రభుత్వం సానుకూల స్పందించింది. రాతపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం - బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు
దశల వారీగా పరిష్కరిస్తాం - మంత్రి బుగ్గన
buggana rajendranath reddy: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. దశల వారీగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు.
finance minister buggana: వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం సీఎస్ సమీర్‌శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని.. తానే స్వయంగా పర్యవేక్షిస్తాని బుగ్గన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్‌సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.