తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉక్రెయిన్‌లో యుద్ధం.. స్వస్థలాలకు రావడానికి తెలుగు విద్యార్థుల బెంబేలు - Russia-Ukraine war news

Telugu Students in Ukraine : అక్కడ పిల్లలు.. ఇక్కడ తల్లిదండ్రులు..! అందరూ భయంతో బెంబేలెత్తుతున్నారు. ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్‌ పంపితే యుద్ధవలయంలో చిక్కుకోవాల్సివచ్చిందన్నది అమ్మానాన్న ఆవేదన. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నా.. తర్వాతి మార్గమేంటో తెలియని పరిస్థితుల్లో పిల్లలు..! ఉక్రెయిన్‌లో రష్యా సృష్టిస్తున్న అలజడిలో చిక్కుకున్న.. తెలుగు విద్యార్థుల వేదన ఇదంతా..! యుద్ధం తీవ్రమయ్యేలోగా.. తమను భారత్ రప్పించాలని వేడుకుంటున్నారు.

Telugu Students in Ukraine
Telugu Students in Ukraine

By

Published : Feb 25, 2022, 8:34 AM IST

Telugu Students in Ukraine : ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై గురువారం రష్యా బాంబుదాడులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి విదేశీ విద్యార్థులు ఈ హఠాత్పరిణామానికి హతాశులయ్యారు. బుధవారం రాత్రి వరకు ఉక్రెయిన్‌లో జనజీవనం ప్రశాంతంగా సాగింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా యుద్ధం మొదలవడంతో తమ పరిస్థితి ఏమిటో అర్థంకాక ఆ దేశంలోని తెలుగువారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉక్రెయిన్‌లోని వైద్య కళాశాలల్లో సుమారు 1500 మంది తెలుగువారు చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వందల మంది మెడిసిన్‌ చదవడానికి వెళ్తున్నారు. వారిలో అత్యధికులు ఉక్రెయిన్‌ అధికారులు చెప్పిన మాటలు విని భారత ప్రభుత్వం విమానాలు ఏర్పాటు చేసినా వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారు. భారత్‌ వచ్చేయాలని కొందరు భావించినా విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా నిర్ణయించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. వెనక్కి వచ్చేయాలని భావించిన కొందరికి విమాన టికెట్లు మార్చికి గానీ దొరకలేదు. ఒక్కసారిగా గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కావడం, విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వారందరూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

కంపించిన భవనాలు

Telugu Students Stuck in Ukraine : రష్యా సరిహద్దుకు 30 కి.మీ.ల దూరంలో ఉన్న ఖార్‌కీవ్‌ నగర శివార్లలో గురువారం తెల్లవారుజాము నుంచి బాంబులు పడటంతో వాటి తీవ్రతకు భవనాలు కంపిస్తున్నాయని అక్కడున్న తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భవనాలు కూలిపోతాయేమోనని చాలామంది ఆరుబయటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఖార్‌కీవ్‌ నగరంలో అత్యధిక సూపర్‌ మార్కెట్లను, దుకాణాలను మూసేశారు. తెరిచి ఉన్న అతికొద్ది దుకాణాల ముందు వందలాది మంది బారులు తీరారు. పలు దుకాణాల్లో సరకులు కూడా అయిపోయాయి. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు కోసం భారీగా బారులు తీరుతున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయని అక్కడి విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పారు.

ఉక్రెయిన్‌ అధికారులు నిలువునా ముంచేశారు

Indian Students Stuck in Ukraine : ఉక్రెయిన్‌ అధికారులు తమను నిలువునా ముంచేశారని పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వస్తుందన్నది అవాస్తవ ప్రచారమని అధికారులు నమ్మబలికారు. దీంతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు వారి వారి పౌరుల్ని వెనక్కి వచ్చేయాలని విమానాలు ఏర్పాటు చేసినా చాలామంది పట్టించుకోలేదు. కనీసం సరకులు కూడా నిల్వ చేసుకోలేదు. అత్యధిక మంది తెలుగు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో నిత్యం వాట్సప్‌ కాల్‌ చేసి మాట్లాడు తుంటారు. తాజాగా ఖార్‌ఖివ్‌ నగరంలో అంతర్జాల సమస్యలు కూడా తలెత్తాయి.మధ్యమధ్యలో అంతర్జాల సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు కనీసం ఇంట్లో వారికి తమ క్షేమసమాచారం చెప్పగలమా లేదా అని దిగులుపడుతున్నారు.

Russia-Ukraine War : విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరు ప్రాంతానికి చెందిన ఎల్లాజి, పైడితల్లి దంపతుల కుమార్తె యమున ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. తమను సురక్షితప్రాంతానికి తీసుకెళుతున్నారని ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. బిడ్డ క్షేమంపై ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన రెడ్డి నోముల సత్యశ్రీజ.. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. ఈ యుద్ధమేఘాలు, బాంబు చప్పుళ్ల మధ్య తమ బిడ్డ ఎలా ఉందోనని ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు.

బంకర్లో తలదాచుకున్నా నాన్నా..

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఉడతా సాయి నోషిత ఉక్రెయిన్‌లోని జఫోరిజియాలో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతోంది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయింది. ప్రస్తుతం బంకర్లలో తలదాచుకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిపింది.

తూ.గో.జిల్లాలో ఆందోళనలో తల్లిదండ్రులు

Russia-Ukraine War Updates : ఉక్రెయిన్‌లో పరిణామాలతో అక్కడ వైద్య విద్య చదివేందుకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. కరప మండలంలోని పెనుగుదురుకు చెందిన బుద్ధాల రిషిత, కొర్ల సత్యదేవ్‌, గొల్లప్రోలుకు చెందిన రాజనాల సుష్మ, తొండంగికి చెందిన సూసన్‌, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన సలాది గంగాభవాని, అమలాపురానికి చెందిన నార్ని లోకేష్‌, కుడుపూడి భవ్య కూడా ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతున్నారు. ఇందులో సత్యదేవ్‌ ఒక్కడే చివరి విమానానికి స్వదేశానికి రాగలిగాడు. తమ బిడ్డలను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని మిగిలినవారి తల్లిదండ్రులు విదేశాంగ శాఖ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి

Russia-Ukraine War News : "నా కుమార్తె రిథిమ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు పూర్తి చేసుకుని విశాఖ రావాల్సిన తరుణంలో జఫోరిజియా నగరంలో చిక్కుకుపోయింది. ఆ నగరంపై కూడా దాడి చేస్తారేమోనని ఆందోళన చెందుతోంది. తెలుగువాళ్లను వెనక్కి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అవకాశాల్ని వెంటనే పరిశీలించాలి."

- భోగవిల్లి రమేశ్‌, మల్కాపురం, విశాఖపట్నం

బాంబ్‌షెల్టర్స్‌లోకి వెళ్లాలనుకుంటున్నాం

"ఖార్‌కీవ్‌ నగరంలో కొన్నిచోట్ల బాంబ్‌షెల్టర్లు ఉన్నాయని తెలిసింది. అక్కడే రక్షణ లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి నగరానికి ఐదు కి.మీ.లకు దూరంలో బాంబులు పడుతున్నాయి. పాస్‌పోర్ట్‌, గుర్తింపుకార్డులు తదితర పత్రాలన్నీ పట్టుకుని మా ఇళ్ల ముందు దిక్కుతోచని స్థితిలో కూర్చొన్నాం."

- బీశెట్టి ఆదిత్య శ్రీనివాస్‌, విశాఖపట్నం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. మదనపల్లెకు చెందిన మహమ్మద్‌ సుహేల్‌, అక్కా తమ్ముళ్లు నవ్యశ్రీ, నితీష్‌లు, జాండ్రపేటకు చెందిన వసీం అక్రమ్‌ ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతున్నారు. వీరి క్షేమసమాచారం కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని ఐదుగురు విద్యార్థులు.. ఉక్రెయిన్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నా.. కనీసం నిత్యావసర వస్తువులూ అందుబాటులో లేవని వివరించారు. తమ పిల్లలను యుద్ధ వాతావరణం నుంచి రక్షించాలంటూ...వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.ఉక్రెయిన్‌లో క్షణక్షణం ప్రాణభయంతో గడుపుతున్నామంటూ.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుణ్ని భారత్ రప్పించాలంటూ.. తల్లిదండ్రులు వేడుకున్నారు.

తెలంగాణ విద్యార్థులదీ..ఉక్రెయిన్‌లో దాదాపు ఇదే పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కున.. బాంబుల శబ్దాల మధ్య గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details