తెలంగాణ

telangana

ETV Bharat / city

Singareni Samme Today : సింగరేణి కార్మికుల సమ్మె షురూ​... 3 రోజుల పాటు విధులకు బ్రేక్​

Singareni Samme Today : బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికుల మూడ్రోజుల సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రభావంతో చాలా చోట్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విధుల్లోకి వెళ్తున్న కార్మికులను కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి.

Singareni Samme Today, సింగరేణి సమ్మె
సింగరేణి సమ్మె

By

Published : Dec 9, 2021, 8:44 AM IST

Updated : Dec 9, 2021, 10:40 AM IST

Singareni Samme Today : సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం నిర్ణయించడంతో.. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు సమ్మె చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఆరు సంఘాలు ఐకాసగా ఏర్పడి.. ఆందోళన కొనసాగిస్తున్నాయి.

విధులకు గైర్హాజరు..

Singareni Strike Today: ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మంచిర్యాల జిల్లా కల్యాణిఖని, శ్రావణపల్లి, కొత్తగూడెం జిల్లా కోయగూడెం బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోపాటు.. ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, హెచ్​ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్ సంఘాలు​ సమ్మెకు దిగాయి. కార్మిక సంఘాల పిలుపుతో మంచిర్యాల జిల్లా కల్యాణిఖని, శ్రావణ్‌పల్లి ఉపరితల గని, కోయగూడెం, జేబీఆర్ ఉపరితల గనులకు కార్మికులు గైర్హాజరయ్యారు. బొగ్గుబ్లాకుల వేలం ప్రక్రియ ఆపాలంటూ టీబీజీకేఎస్​తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు.. పూర్తి మద్దతు తెలిపాయి. కార్మికులు స్వచ్ఛందంగా గనులకు రాకుండా విధులను బహిష్కరించారు. గనులపై కార్మికులు లేక యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అత్యవసర విధులు నిర్వర్తించే కార్మికులు మాత్రమే హాజరయ్యారని అధికారులు తెలిపారు.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

Singareni Workers Strike : సమ్మె ప్రభావంతో సింగరేణివ్యాప్తంగా 23 భూగర్భ, 19 భూఉపరితల గనుల్లో సమ్మె ప్రభావం పడనుంది. 42 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సంపూర్ణంగా మూడు రోజులపాటు సమ్మె జరిగితే సంస్థకు రోజుకు దాదాపు 76 కోట్ల నష్టం జరుగుతుంది. అయితే ఇంతకముందే కార్మిక సంఘాలతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపింది. సంస్థ తరఫున కేంద్రానికి లేఖ రాసినట్లు వివరించింది. ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని సంఘాలకు తెలిపింది.

కార్మికుల సమ్మెతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్​లోని 6 భూగర్భ గనుల్లో, 4 ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మికసంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

బొగ్గు ఉత్పత్తికి ఆటంకం..

Singareni Three Days Samme : భూపాలపల్లిలో మూడురోజుల సమ్మెకు సింగరేణి కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపారు. విధులకు హాజరు కాకపోవడంతో గనులు నిర్మానుష్యంగా మారాయి. కార్మికుల సమ్మెతో రోజుకు సుమారు ఏడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో ఐక్య కార్మిక సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను బయటకు పంపించివేశారు.

Last Updated : Dec 9, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details