తెలంగాణ

telangana

ETV Bharat / city

GST collections : రూ.1.30 లక్షల కోట్లను దాటిన GST వసూళ్లు

GST collections : గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు తెలంగాణలో 24%, ఆంధ్రప్రదేశ్‌లో 10% వృద్ధి చెందాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా 5వ నెల రూ.లక్ష కోట్లను, వరుసగా రెండో నెల రూ.1.30 లక్షల కోట్లను దాటాయని పేర్కొంది.

By

Published : Dec 2, 2021, 9:20 AM IST

GST collections, GST collections 2021, జీఎస్టీ వసూళ్లు, పార్లమెంట్​లో తెలంగాణ
పార్లమెంట్​లో తెలంగాణ

GST collections : జీఎస్‌టీ వసూళ్లు వరుసగా 5వ నెల రూ.లక్ష కోట్లను, వరుసగా రెండో నెల రూ.1.30 లక్షల కోట్లను దాటాయి. నవంబరులో రూ.1,31,526 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది గత ఏడాది నవంబరుతో పోలిస్తే 25.30% అధికమని తెలిపింది. జీఎస్‌టీ మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ ఈ ఏడు ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1,39,708 కోట్లు వసూలైందని, తర్వాత ఇది రెండో అత్యధికమని వెల్లడించింది. ‘‘రిటర్న్‌లు దాఖలుచేయని వారికి ఈ-వేబిల్లుల జారీ, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ నిలిపేయడంతో గత కొన్ని నెలలుగా దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరిగి, వసూళ్లు మెరుగుపడ్డాయి’’ అని ఆర్థిక శాఖ విశ్లేషించింది. గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు తెలంగాణలో 24%, ఆంధ్రప్రదేశ్‌లో 10% వృద్ధి చెందాయి. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి సగటున 20% వృద్ధి నమోదుకాగా, తెలంగాణలో అంతకంటే ఎక్కువ నమోదైంది.

రాష్ట్రాలు భూమి ఇస్తేనే నవోదయ విద్యాలయాలు

GST collections 2021 : రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూమి ఇవ్వడానికి సుముఖత చూపితేనే కొత్తగా నవోదయ విద్యాలయాలు మంజూరుచేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఈ పాఠశాలల ఏర్పాటు గురించి తెరాస ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘కొత్త పాఠశాలల ఏర్పాటు నిరంతర ప్రక్రియ. భవనాల నిర్మాణానికి అవసరమైన భూమిని ఉచితంగా ఇవ్వడానికి, నిర్మాణం పూర్తయ్యేంతవరకూ అద్దెలేని భవనాలు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపే అంగీకారంపై కొత్తవి మంజూరుచేయడం ఆధారపడి ఉంటుంది’’ అని వివరించారు.

ఫాస్టాగ్‌ అనంతరం పెరిగిన టోల్‌ వసూళ్లు: కేంద్ర మంత్రి గడ్కరీ

parliament winter sessions : ఫాస్టాగ్‌ విధానం ప్రవేశపెట్టిన తర్వాత జాతీయ రహదారుల్లో టోల్‌ వసూళ్లలో పెరుగుదల కనిపించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ విధానం మొదలైందని, ఆ రోజు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ నాటికి రోజుకు రూ.104 కోట్ల టోల్‌ వసూలైనట్లు చెప్పారు. 2020 ఫిబ్రవరిలో ఇదే సమయంలో రోజుకు కేవలం రూ.80 కోట్లే లభ్యమైనట్టు తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో తెరాస ప్రభుత్వం విఫలం: ఉత్తమ్‌

Paddy procurement : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ జీరో ఆవర్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. మార్కెట్‌కు వచ్చిన వానా కాలం పంటను మొత్తం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతుల తరఫున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. యాసంగి పంట వేసేందుకు ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో ఆందోళన చేస్తున్న తెరాస ఎంపీలు వెనక్కు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని తమ ముఖ్యమంత్రికి చెప్పాలని సూచించారు. ఆ సమయంలో తెరాస సభ్యులు గట్టిగా నినాదాలు చేస్తుండడంతో సభాపతి మరొకరికి అవకాశం ఇచ్చారు.

కరోనా పరీక్షల పేరుతో శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా వసూళ్లు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Telangana in Parliament : శంషాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల దగ్గర ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టు ఉన్నా, యాంటిజెన్‌ టెస్ట్‌ పేరిట ప్రైవేటు సంస్థలు రూ.4,500 వసూలు చేస్తున్నాయన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details