తెలంగాణ

telangana

ETV Bharat / city

జమ్ముకశ్మీర్​లో చలి తీవ్రతకు తెలుగు జవాను మృతి

చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డెప్పనాయుడు అనే జవాను జమ్ముకశ్మీర్​లో కన్నుమూశారు. చలి అధికం కావటంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన... విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. రెడ్డెప్ప మృతితో అతని స్వగ్రామం గడ్డకిందపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జమ్ముకశ్మీర్​లో చలి తీవ్రతకు తెలుగు జవాను మృతి
జమ్ముకశ్మీర్​లో చలి తీవ్రతకు తెలుగు జవాను మృతి

By

Published : Jan 3, 2021, 9:12 AM IST

సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు.. నిత్యం దేశ రక్షణకు పరితపించారు. అనూహ్యంగా హిమపాతం మింగేయటంతో ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన.. జవాన్‌ రెడ్డెప్పనాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెడ్డెప్పనాయుడు, శాంతమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మంచు రెడ్డెప్పనాయుడు(38) ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు పురుషోత్తం నాయుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఏటా సంక్రాంతి పండగకు ఇరువురూ స్వగ్రామానికి చేరుకొని కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపేవారు. ఎప్పటి లాగానే ఈ ఏడాది సంక్రాంతి పండగకు సెలవుపై ఇంటికి వస్తాడనుకున్న వ్యక్తి చలి తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ బేస్‌ క్యాంపు నుంచి శుక్రవారం మధ్యాహ్నం తన భార్య, పిల్లలతో చరవాణిలో చాలా సమయం సరదాగా మాట్లాడిన ఆయన శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహచర జవాన్లు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు.

పండగకు వస్తానంటివే..

సంక్రాంతి పండగకు వస్తానని మాటిచ్చి మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా అంటూ తల్లి శాంతమ్మ కన్నీరుమున్నీరయ్యారు. గడ్డకిందపల్లిలో ఎంతో ఇష్టంతో ఇల్లు కటించారని, దాన్ని కళ్లతో చూడకుండానే కన్నుమూశాడంటూ విలపించారు. పండగ రోజు బంధువులను పిలిచి కొత్త ఇంట్లో విందు భోజనాలు ఏర్పాటు చేద్దామని చెప్పిన తన భర్త మంచు కొండల్లోనే కరిగిపోవడంకలచివేస్తోందని ఆయన భార్య రెడ్డెమ్మ రోదించారు. తన పిల్లలు సాత్విక్‌, నిషితలకు ఆ భగవంతుడు అన్యాయం చేశాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. తల కొరివి పెడతాడనుకున్న పెద్ద కొడుకు మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు తండ్రి రెడ్డెప్పనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కుమారుడి ప్రోద్బలంతో సేంద్రియ సాగు.. లాభాలు బాగు

ABOUT THE AUTHOR

...view details