'పట్టణ ఓటర్లు ఎన్నికల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు' పురపాలక ఎన్నికల్లో ఓటర్లు అందరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. పోలింగ్ సన్నద్ధత, ఏర్పాట్లపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతను జిల్లాల వారీగా తెలుసుకున్న ఎస్ఈసీ... వారికి కొన్ని సూచనలు చేశారు.
వివరాలు సరిచూడండి
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంత ఓటర్లు ఎన్నికల్లో ఎక్కువగా పాల్గొనడం లేదన్న ఆయన... పురపోరులో ఓటరు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థుల తుది జాబితా ఖరారయ్యాక గుర్తులు కేటాయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నాగిరెడ్డి తెలిపారు. బ్యాలెట్ పేపర్ ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగా చూడాలని చెప్పారు.
గుర్తింపు కార్డులు తప్పనిసరి
పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్లు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. పోలింగ్ రోజు ఓటరు చేతికి సిరా గుర్తు అంటించేటప్పుడు నిశితంగా పరిశీలించాలని తెలిపారు. ప్రతి ఓటర్ వద్ద కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూశాకే ఓటింగ్‌కు అనుమతించాలని స్పష్టం చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేయండి
పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులను కల్పించాలని, పోలింగ్ విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని నాగిరెడ్డి తెలిపారు. పోలీసు అధికారులతో చర్చించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు వివరాలు అన్ని రాజకీయ పార్టీలకు, ఓటర్లకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లు, అధికారులకు నాగిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం