అప్పులు తీసుకోవడంలో తెలుగురాష్ట్రాలు పోటీపడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం పెరిగింది. గతేడాది దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఆరోస్థానం పొందగా, ఏపీ ఆరోస్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బులిటెన్ ఈ వివరాల్ని వెల్లడించింది.
తెలంగాణలో ఇలా...
తెలంగాణ రాష్ట్రం 2018-19లో బహిరంగ మార్కెట్ నుంచి స్థూలంగా రూ.26,740 కోట్లు, నికరంగా రూ.22,183 కోట్ల రుణం సేకరించింది. 2019-20 కల్లా స్థూల రుణం రూ.37,109 కోట్లు, నికరరుణం రూ.30,697 కోట్లకు చేరింది. దీన్నిబట్టి ఏడాది కాలంలో స్థూలరుణం 38.77%, నికర రుణం 38.38% పెరిగింది. గత ఏడాది దేశంలో బహిరంగ మార్కెట్ నుంచి అత్యధిక రుణం సేకరించిన 9వ రాష్ట్రంగా నిలిచింది. 2020-21 సంవత్సరంలో ఏప్రిల్, మేనెలల్లో తెలంగాణ రాష్ట్రం స్థూలంగా రూ.8వేల కోట్లు, నికరంగా రూ.6,750 కోట్ల మేర సేకరించింది. ఈ విషయంలో రాష్ట్రం 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న దాన్ని బట్టి చూస్తే మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూలరుణం రూ.48వేల కోట్లకు, నికర రుణం రూ.40,500కోట్లకు చేరే అవకాశం ఉంటుంది.