తెలంగాణ

telangana

ETV Bharat / city

మద్దతు పెరుగుతోంది... సమ్మె ఉద్ధృతమవుతోంది - huge support to telangana rtc strike

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్ధృతంగా మారుతోంది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే కాకుండా వారికి మద్దతుగా అఖిల పక్ష నేతలు, రైతు సంఘాలు మద్దతుగా సమ్మెలో పాల్గొంటున్నాయి. హైదరాబాద్​లో నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అఖిల పక్షం మద్దతు

By

Published : Oct 12, 2019, 5:05 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. కార్మికులకు మద్దతుగా పలు పార్టీల నేతలు, పలు సంఘాలు మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొంటున్నాయి. మేడ్చల్​లో డిపో డ్రైవర్​ రాము చెట్టు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా దూకుతానని బెదిరించాడు. అనంతరం నాయకులు, ఆర్టీసీ సిబ్బంది ప్రాధేయపడగా చెట్టు దిగి కిందకు వచ్చాడు.

రైతు సంఘాల మద్దతు

మెహిదీపట్నం ఆర్టీసీ డిపో ముందు భాజపా నేతలతో పాటు ఉద్యోగులూ సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కార్మికులకు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,, అఖిల భారత కిసాన్ ఫెడరేషన్... రైతు స్వరాజ్య వేదిక... రైతు సంఘం ప్రతినిధులు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈనెల15న రైతులు, రైతు కూలీ సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి.

కంటోన్మెంట్​లో మౌనదీక్ష

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు అండగా అఖిల పక్షం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మౌనదీక్ష చేపట్టి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. 48వేల కార్మిక కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్​ ఏం పట్టనట్లు వ్యవహరించడమేంటని నిలదీశారు.

నల్ల బ్యాడ్జీలతో నిరసన

పాతబస్తీలోని ఫలక్​నుమా బస్​ డిపో వద్ద సిబ్బంది నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నేతలు, పాతబస్తీ భాజపా నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అఖిల పక్షం మద్దతు

ABOUT THE AUTHOR

...view details