గ్రేటర్ హైదరాబాద్లో తిరిగే ఓల్వో బస్సులు రాజధానిగా బస్సులుగా మారిపోనున్నాయి. ఇప్పటికే రాణిగంజ్-2 డిపోకు చెందిన ఒక ఓల్వో బస్సును రాజధాని బస్సుగా మార్చేశారు. సుమారు రెండు రూ.2లక్షలు వెచ్చించి దీన్ని తయారుచేశారు. అధనపు హంగులు, అత్యాధునిక సౌకర్యాలు, బస్సు రంగు, సీట్ల పేట్రన్ లో మార్పులు చేశారు. ఓల్వో బస్సుకు 32 సీట్లుండేవి. ఓల్వో బస్సులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని...పూర్తిగా మార్చేసి...32 సీట్లను...40 సీట్లుగా మార్చేశారు. 8 సీట్లను అదనంగా చేర్చారు. హైదరాబాద్కు మెట్రో రైలు రాకముందు 2014 డిసెంబర్ లో 80 ఓల్వో ఏసీ సిటీ బస్సులు రోడ్డెక్కాయి.
2 నెలలుగా డిపోలకే పరిమితం
ప్రారంభంలో బాగానే నడిచినప్పటికీ...రాను రాను...ప్రయాణికులు వీటిలో ఎక్కడం మానేశారు. ఆ తర్వాత మెట్రో రావడంతో ఓల్వో బస్సులు ప్రయాణించే వారు తగ్గిపోయారు. దీంతో లాక్ డౌన్ తర్వాత పెద్దగా వీటిని ఆర్టీసీ నడిపించలేదు. విమానాశ్రయం రూట్ లోనే వీటిని నడిపించేవారు. విమానాల రాకపోకలు ప్రారంభమైన సమయంలో వీటిని వినియోగించుకున్నారు. ప్రస్తుతం విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ (విద్యుత్) బస్సులను నడిపిస్తున్నారు. దీంతో రెండు నెలలుగా ఈ బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి.
తలకు మించిన భారం
రాణిగంజ్ -2డిపో, మియాపూర్, బీహెచ్.ఈఎల్, హెచ్.సీ.యూ, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ -2 డిపోలలో ఈ ఓల్వో బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు కిలోమీటర్ కు రూ.60 ఖర్చయితే..ఆదాయం మాత్రం రూ.45 నుంచి రూ.55 మాత్రమే వచ్చేవి. ప్రతి కిలోమీటర్ కు రూ.10 వరకు నష్టం వచ్చేదని ఓ అధికారి వెల్లడించారు. ఓల్వో బస్సుల నిర్వహణ తలకుమించి భారంగా మారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఓల్వో బస్సులు తెల్ల ఏనుగుల్లా మారిపోయాయంటున్నారు. ఓల్వా బస్సులు ప్రధానంగా విమానాశ్రయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల మీద ఆధారపడి నడిచేవి. కానీ..కోవిడ్ -19 నేపథ్యంలో రైళ్లు సరిగ్గా నడవక, విమానాల రాకపోకలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో బస్సులను తప్పనిసరి పరిస్థితుల్లో డిపోలకే పరిమితం చేయాల్సి వచ్చింది.
ఏపీకి.. రాజధానిగా మారిన ఓల్వో బస్సులు
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సుల ఒప్పందం జరగడంతో పాటు..ఏపీఎస్.ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలో తిరిగే కొన్ని బస్సులను ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో రాజధానిగా మార్చిన ఓల్వో బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఏపీకీ ప్రత్యేక బస్సుల కింద ఈ ఓల్వో బస్సులను టీఎస్.ఆర్టీసీ నడిపించింది. ఒక్కో ఓల్వో బస్సుకు రూ.22 వేలు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో రాజధాని బస్సును సోమవారం అధికారికంగా ప్రారంభించి గుంటూరు-వయా-విజయవాడ మీదుగా నడిపించాలని నిర్ణయించారు. ఈ బస్సుకు వచ్చే ఆధరణను చూసి...మిగితా బస్సులను కూడా తయారు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. రాణిగంజ్ డిపోలో 22 ఓల్వో బస్సులు ఉండగా...అందులో సుమారు 6 బస్సులను రాజధాని బస్సులుగా మార్చనున్నారు.
నేడే ముహూర్తం
ఆదివారం రాత్రి 11 గంటలకు గుంటూరు-వయా-విజయవాడ మీదుగా హైదరాబాద్ కు కొత్తగా తయారైన రాజధాని బస్సును ప్రయోగాత్మకంగా నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఇక్కడి నుంచి బస్సు బయలుదేరి వెళ్లి..కాసేపు డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటారని..ఆ తర్వాత రాత్రి 11 గంటలకు బస్సు గుంటూరు నంచి బస్సులు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ బస్సుకు సంబంధించిన రిజర్వేషన్ టిక్కెట్లను కూడా ప్రారంభించినట్లు తెలిపారు.