కరోనా వ్యాప్తి నేపథ్యంలో రవాణా శాఖ ఆన్లైన్ సర్వీసులను విస్తృతం చేసింది. ఆర్టీఏ సేవల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం 11 సర్వీసులను ఆన్లైన్లో అందిస్తుంది. ఒకప్పుడు రవాణాశాఖకు సంబంధించిన ఏ సేవలు పొందాలనుకున్నా... ఖచ్చితంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. గంటల తరబడి కార్యాలయాల్లో నిల్చోవడం, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అది లేదు.. ఇది లేదని తిప్పించుకోవడం వంటి తిప్పలు వినియోగదారులకు తప్పేవి కావు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఇంట్లోనే కూర్చుని తమకు కావాల్సిన సేవలు సంతోషంగా పొందవచ్చని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది జూలై 24న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఐదు ఆన్లైన్ సేవలను ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఇటీవలి కాలంలో మరో 6 ఆన్లైన్ సేవలను రవాణాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం కలిపి 11 సేవలను రవాణాశాఖ ఆన్లైన్లో అందిస్తుంది.
ప్రస్తుతం రవాణాశాఖలో లభిస్తున్న ఆన్లైన్ సేవలు..
- డూప్లికేట్ లైసెన్స్
- డూప్లికేట్ లెర్నర్స్ లైసెన్స్
- డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జీ (రవాణా వాహనాల కోసం)
- స్మార్ట్ కార్డ్ (పాత పీవీసీ కార్డు లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవడం)
- లైసెన్స్ హిస్టరీ షీట్
- డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ(రెన్యూవల్)
- డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు
- గడువు ముగిసిన లెర్నర్స్ స్థానంలో కొత్త లెర్నర్స్ లైసెన్స్
- వాహన తరగతిని చేర్చడానికి లైసెన్స్
- ప్రమాదకర వస్తువులు తరలించే వాహనాల లైసెన్స్ ఆమోదించడం
- గడువు ముగిసిన లైసెన్స్‌కు లెర్నర్స్ లైసెన్స్ జారీ.
చిరునామా మార్చుకోవడంలో తప్పిన తిప్పలు..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం మంది అద్దె ఇళ్లలోనే నివాసముంటుంటారు. ఏడాదికో, రెండేళ్లకొకసారో ఇల్లు మారాల్సి వస్తే... డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఇల్లు మారితే డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్చడం ఓ ప్రహసనంగా ఉండేది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం.. నిర్ణీత తేదీ, సమయానికి దగ్గర్లోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లడం.. అక్కడ దళారులతో ఇబ్బంది పడాల్సివచ్చేది. అన్నీ అయిపోతే.. సంబంధిత లైసెన్స్‌కు సంబంధించిన ఫోటో దిగి, డిజిటల్ సంతకం పెడితే మనవంతు పని ముగుస్తుంది. ఆ తర్వాత లైసెన్స్‌ను ఇంటికి పంపించడంలో అనేక ఇబ్బందులు తలెత్తేవి. స్మార్ట్‌కార్డుల కొరత ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పోస్టులో ఇంటికి రావడానికి వారాలు, నెలల వరకు వాహనదారులు ఎదురు చూడాల్సిన పరిస్థతి. ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇబ్బందులు తగ్గిపోయాయని వాహనదారులు అంటున్నారు.