తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్ నియంత్రణ చర్యలపై నేడు మంత్రుల సమీక్ష - తెలంగాణ కరోనా కేసులు

corona
corona

By

Published : Jan 19, 2022, 7:58 PM IST

Updated : Jan 20, 2022, 10:07 AM IST

19:56 January 19

నేటితో ముగియనున్న కొవిడ్‌ ఆంక్షల గడువు

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణపై నేడు మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య-ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్‌శాఖల మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు సచివాలయం నుంచి అన్నిజిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై మంత్రుల సమీక్షిస్తారు. ఆస్పత్రులు, పడకలు, సిబ్బంది, ఔషధాలపై చర్చిస్తారు.

రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వనున్నారు. ఫీవర్ సర్వేపై చర్చించి నిర్ణయం వెల్లడించే అవకాశముంది. రాష్ట్రంలో నేటితో కొవిడ్‌ ఆంక్షల గడువు ముగియనుంది. నియంత్రణ చర్యలపై చర్చించి ఆదేశాలు జారీ చేయనున్నారు మంత్రులు. వందశాతం రెండో డోసు టీకాల పంపిణీ పూర్తిపై సమీక్షించనున్నారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్, బూస్టర్ డోసు వేగవంతానికి చర్యలపై సమీక్షిస్తారు.

Telangana corona cases: గ్రామీణ తెలంగాణలో కొవిడ్‌ పంజా విసురుతోంది. జీహెచ్‌ఎంసీలో అత్యధిక కేసుల పరంపర కొనసాగుతుండగా రాష్ట్రంలోని మరో 14 జిల్లాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. మంగళవారం నుంచి బుధవారానికి ఒక్కరోజులోనే 30-40 శాతం కేసులు పెరగడం గమనార్హం. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 1,474 కేసులు నిర్ధారణ అవగా.. గత వారం రోజుల్లో ఇదే అధికం. మేడ్చల్‌ మల్కాజిగిరి(321), రంగారెడ్డి(275), హనుమకొండ(130), సంగారెడ్డి(123), ఖమ్మం(104), మంచిర్యాల(77), కరీంనగర్‌(74), భద్రాద్రి కొత్తగూడెం(72), పెద్దపల్లి(70), మహబూబ్‌నగర్‌(66), సిద్దిపేట(64), నిజామాబాద్‌(58), యాదాద్రి భువనగిరి(55), వికారాబాద్‌(52) జిల్లాల్లో వైరస్‌ జడలు విప్పుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాకపోకలు యథేచ్ఛగా కొనసాగుతుండడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాల పేరిట ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతుండడం.. కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం తదితర కారణాలతో పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో బుధవారం 3,557 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత 8 నెలల కాలంలో ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

24 వేలు దాటిన క్రియాశీల కేసులు

రాష్ట్రంలో తాజా కేసుల నమోదుతో మొత్తం బాధితుల సంఖ్య 7,18,196కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో ముగ్గురు మరణించడంతో ఇప్పటి వరకూ 4,065 మంది కన్నుమూశారు. వైరస్‌ బారినపడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 1,773 మంది కోలుకోగా మొత్తంగా 6,89,878 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 19న సాయంత్రం 5.30గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 24,253కు పెరిగింది. రాష్ట్రంలో మరో 2,71,165 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు. నీ మహబూబాబాద్‌ శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇంట్లో చికిత్సలే అధికం

రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి ప్రస్తుతం 24వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా వీరిలో ప్రస్తుతం 1091 మంది ఆక్సిజన్‌ పడకల్లో, 658 మంది ఐసీయూ పడకల్లో, 924 మంది రెగ్యులర్‌ పడకల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలుపుకొని 56,395 పడకలుండగా.. వీటిల్లో 2,673 పడకల్లోనే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. వైద్యులు కూడా స్వల్ప లక్షణాలతో ఆసుపత్రులకొచ్చే రోగులను ఇంటి వద్దే చికిత్స పొందాల్సిందిగా సూచిస్తున్నారు. అదే రెండోదశలో ఆసుపత్రుల చేరిక శాతం అధికంగా ఉండేది. గతేడాది రెండోదశ ఉద్ధృతంగా ఉన్న ఏప్రిల్‌ మాసంలో దాదాపు 33-40 శాతం మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. అపుడు ఆక్సిజన్‌ అవసరాలు కూడా సరిపోలేదని వైద్యవర్గాలు తెలిపాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. బాధితుల్లో 95 శాతానికి పైగా ఇంటి వద్దనే చికిత్స పొందితే సరిపోతుందని విశ్లేషించాయి. ఒమిక్రాన్‌లో వైరస్‌ ముక్కు, గొంతు వరకే పరిమితమవుతుండడంతో తీవ్రమైన అనారోగ్యం బారినపడే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. టీకాలను పొందడం ద్వారా తీవ్ర అనారోగ్యం బారినపడకుండా రక్షణ లభిస్తుందని, అర్హులందరూ త్వరగా టీకా డోసులను పొందాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి :'ఆదివారం పీక్​ స్టేజ్​కు కరోనా థర్డ్ వేవ్.. ఎన్ని కేసులు వస్తాయంటే...'

Last Updated : Jan 20, 2022, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details