తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వేళలోనూ రిజిస్ట్రేషన్లు ఆగలేదు... ఆదాయం తగ్గలేదు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగానే వచ్చింది. కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నప్పటికీ క్రమంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతోంది. రోజుకు రూ.30కోట్లుకు మించి రాబడులు వస్తున్నట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. గడిచిన యాభై రోజుల్లో రూ.1326.69 కోట్లు రాబడి రాగా ఒక్క జూన్‌ నెలలోనే రూ.856.11 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ వెల్లడించింది.

telangana registration and stamps dept
telangana registration and stamps dept

By

Published : Jul 1, 2020, 1:00 PM IST

రాష్ట్రంలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు క్రమంగా సాధారణ పరిస్థితులకు చేరువ అవుతున్నాయి. ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలు సడలించడం, ప్రజారవాణా లేకపోయినా... వ్యక్తిగత రవాణాకు ఆటంకాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించి విధులకు హాజరవుతున్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. భౌతిక దూరం, మాస్క్‌ తప్పనిసరి చేశారు.

తగ్గిన స్లాట్ బుకింగ్‌లు

సాధారణంగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో కార్యాలయాలు రద్దీగా ఉండేవి. శుభకార్యాలకు అనుకూలమైన రోజుల్లో మరింత రద్దీగా కనిపించేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లకు వచ్చే వారు ముందే వచ్చి వేచి ఉండకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్లు వారికి కేటాయించిన తేదీల్లో... నిర్దేశించిన సమయంలో వచ్చి తమ పని చేసుకునేట్లు వెసులుబాటు కల్పించారు.

అయితే మే నెలలో ఈ విధానానికి అధికంగా స్పందన వచ్చింది. ఏకంగా 76వేలకుపైగా రిజిస్ట్రేషన్లు స్లాట్‌ బుకింగ్‌ ద్వారా జరిగాయి. కానీ జూన్‌ నెలలో ఈ విధానం పూర్తిగా మూలన పడ్డది. నెల అంతటికి కేవలం నాలుగు రిజిస్ట్రేషన్లు మాత్రమే స్లాట్‌ బుకింగ్‌ విధానంలో జరిగాయి. కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా సడలింపులతో స్లాట్‌ బుకింగ్‌కు చొరవ చూపకుండా నేరుగా వస్తున్నారని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు.

పెరిగిన రాబడి

జూన్‌ నెలలో 1,37,876 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా రూ.394.23 కోట్లు ఆదాయం వచ్చింది. ఇ-స్టాంపులు విక్రయం ద్వారా మరో రూ.461.88 కోట్లు రాబడి వచ్చింది. మొత్తం కలిపి రూ.856.11 కోట్లు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. కొవిడ్‌ నిబంధనల్లో సడలింపులు ఇచ్చిన తరువాత మే 11నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మే, జూన్‌ నెలల్లో మొత్తం 2,17,752 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాగా తద్వారా ప్రభుత్వానికి రూ.614.42 కోట్లు ఆదాయం వచ్చింది. ఇ-స్టాంపుల విక్రయాల ద్వారా మరో రూ.712.27 కోట్లు రాబడి వచ్చింది. మొత్తం ఈ యాభై రోజుల్లో రూ.1326.69 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమైంది.

మరింత పెరిగే అవకాశం

సాధారణ రోజుల్లో రోజుకు రూ.25 నుంచి రూ.30 కోట్లు మేర రాబడి వస్తుంది. అదే రిజిస్ట్రేషన్లకు అనుకూలమైన రోజు వంద కోట్లు అంతకు మించి కూడా రాబడి రావడం పరిపాటి. కానీ లాక్‌ డౌన్‌ తరువాత గడిచిన 50 రోజుల్లో ఆదివారాలు, ఇతర సెలవులు పోగా 40 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు పని చేశాయి. ఆ లెక్కన తీసుకుంటే రోజుకు సగటున రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.33.16కోట్లు రాబడి వచ్చింది. సాధారణ రోజుల్లో మాదిరిగానే రాబడులు వస్తుండడంతో రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగి ఆదాయం కూడా గతం కంటే 10 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details