తెలంగాణ

telangana

ETV Bharat / city

చేబదుళ్లలో తెలంగాణది ఆరో స్థానం - debts for telangana

దేశంలో చేబదుళ్ల రూపంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న తొలి ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక రుణాలు సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడు మాసాల్లో నెలకు సగటున రూ.3,708.71 కోట్ల చొప్పున రూ.25,961 కోట్ల అప్పు సేకరించింది. ఈ మేరకు ఆర్​బీఐ నివేదికలో వెల్లడించింది.

debts for telangana
చేబదుళ్లలో తెలంగాణది ఆరో స్థానం

By

Published : Dec 25, 2020, 7:34 AM IST

దేశంలో చేబదుళ్ల రూపంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న మొదటి ఆరు రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన డిసెంబరు నెలవారీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, నాగాలాండ్‌, తెలంగాణ రాష్ట్రాల వేస్‌ అండ్‌ మీన్స్‌ వినియోగం పెరిగింది. తమ పరిమితికి మించి చేబదుళ్ల రూపంలో రుణాలు తీసుకున్నాయి. మరోపక్క మణిపుర్‌, పంజాబ్‌, పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రాలు చేబదుళ్లు తగ్గించుకున్నాయి.

* 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బహిరంగ మార్కెట్‌ రుణాలు భారీగా పెరిగాయి. కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ప్రభుత్వాలు అప్పులపై ఆధారపడ్డాయి. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌ తప్ప అన్ని రాష్ట్రాల రుణభారం హెచ్చింది. ఆర్‌బీఐ నుంచి రుణాలు పొందే అన్నిరకాల మార్గాలను రాష్ట్రాలు వినియోగించుకున్నాయి.

అప్పుల్లో ఐదులో రాష్ట్రం..

బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక రుణాలు సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడు మాసాల్లో నెలకు సగటున రూ.3,708.71 కోట్ల చొప్పున రూ.25,961 కోట్ల అప్పు సేకరించింది. ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఏడాది అప్పు రూ.44,504 కోట్లకు చేరనుంది. గత ఏడాది చేసిన మొత్తం అప్పులో 70% మొత్తాన్ని ఈ ఏడు నెలల్లోనే తీసుకొంది. 2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణం 38.77% పెరిగింది. ఇప్పటివరకు ఉన్న రుణ సరళిని బట్టి ఈ ఏడాది 19.92% వృద్ధి కన్పిస్తోంది. ఇక ఆర్‌బీఐ నుంచి రుణాలు పొందడంలోనూ అక్టోబర్‌ నెలలో అన్ని మార్గాలనూ తెలంగాణ వినియోగించుకుంది. ఆ నెలలో 31 రోజులు స్పెషల్‌ డ్రాయింగ్‌, 29 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌, 14 రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకొంది.

* 2020 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.37,250 కోట్ల రుణం సేకరించి మూడో స్థానంలో నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో మహారాష్ట్ర (రూ.59,500 కోట్లు), తమిళనాడు (రూ.54,000 కోట్లు), ఏపీ (రూ.37,250 కోట్లు), కర్ణాటక (రూ.37,000 కోట్లు), తెలంగాణ (రూ.25,961 కోట్లు) ఉన్నాయి.

ఇవీచూడండి:వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

ABOUT THE AUTHOR

...view details