సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిర్మాణ సంస్థలను, అధికారులును ఆదేశించారు. వర్క్ఛార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఫ్లోర్వైస్ అంతర్గత నిర్మాణాలు జరగాలని సూచించారు. ఆర్అండ్బీ కార్యాలయంలో సోమవారం అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
అమరవీరుల స్మారక చిహ్నం మీద నిరంతరం జ్వలించే జ్వాలలో అమరుల త్యాగం ప్రతిబింబించే విధంగా ఉండాలని.. దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, వర్క్ ఏజన్సీ, కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్‌లకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఫ్లోర్వైస్ డిజైన్ ప్లాన్స్‌ను మంత్రి పరిశీలించారు.
స్మారక చిహ్నం భవనంలోకి ప్రవేశించే ముందు చిన్నారులతో అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు డిజైన్, ల్యాండ్ స్కేప్, ఆడియో -వీడియో విజువల్ రూమ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించిన ప్లాన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి తిలకించారు. ముఖద్వారం వద్ద తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అని తెలుగులో ఉండాలని, ఆడియో -విజువల్ రూమ్‌లో సీటింగ్ వరుసల మధ్యలో కింద నుంచి మీదకు ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. అమరుల త్యాగాలను కళ్లకు కట్టినట్టు చూపించే ఫొటో ఎగ్జిబిషన్, ఒక కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్ ప్లాన్స్‌ను మంత్రి పరిశీలించారు.