అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకపోవడం లాంటి కారణాలతో రోజులో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ.. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. శిరస్త్రాణం, డ్రైవింగ్ లైసెన్సు లేకున్నా... చరవాణిలో మాట్లాడుతూ వాహనం నడిపినా.. మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు ప్రమాదాలు ఎలా చోటు చేసుకుంటున్నాయనే దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ.. అవగాహన కల్పిస్తున్నారు. వీటిని చూసైనా వాహనదారులు నిబంధనలు పాటించి ప్రాణాలు దక్కించుకుంటారనే ఉద్దేశంతో పలు ప్రమాదాలకు చెందిన సీసీటీవీ దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలో ఉంచుతున్నారు.
- రెండు రోజుల క్రితం మొయినాబాద్ సమీపంలో హైదరాబాద్ వైపు వస్తున్న ఆటోను లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పల్టీకొట్టింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న డ్రైవర్, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
- శంకర్పల్లి మండలం దొంతుపల్లి ట్రక్ డ్రైవర్ వాహనాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లాడు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ద్విచక్ర వాహనదారుడు అడ్డదారిలో వస్తున్న ట్రక్‌ను గమనించక నేరుగా వచ్చి ఢీకొట్టాడు. ద్విచక్ర వాహనదారుడు శిరస్త్రాణం ధరించినా... దాన్ని లాక్ చేయకపోవడం వల్ల... కిందపడిపోయిన వెంటనే శిరస్త్రాణం ఊడిపోయింది. వెనకాల కూర్చున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల అతడికీ గాయాలయ్యాయి. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు.
- వారం క్రితం జగద్గిరిగుట్టలో ఓ తండ్రి తన కుమారుడిని తీసుకొని బయటికి వెళ్లాడు. ద్విచక్ర వాహనంపైనే కూర్చొబెట్టి, షాపు లోపలికి వెళ్లాడు. తండ్రి కోసం కాసేపు ఎదురు చూసిన కుమారుడు పరుగెత్తుతూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటు నుంచి వస్తున్న కారు, పిల్లాడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
- జులై 18న బాచుపల్లి వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు వేగంగా వెళ్తూ కారు, లారీ మధ్యలో నుంచి దూసుకుపోయాడు. కారును దాటుకొని వెళ్లే క్రమంలో పక్కనే ఉన్న లారీ కింద పడిపోయాడు. లారీ ముందు టైరు ద్విచక్రవాహనదారుడిపై నుంచి పోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
కుటుంబం కోసమైనా..