అత్యవసర సరకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చాం. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్షించాలని నిర్ణయించాం. అవసరం లేకున్నా వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తాం. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తిస్తాం. పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తాం. కొత్త పాసులు ఇచ్చేవరకూ పాత పాసులు కొనసాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పాసులు ఇస్తాం. వారంలో ఆరు రోజులకు ఆరు రంగుల పాసులు జారీ చేస్తాం. కలర్ కోడ్ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలి. - మహేందర్‌రెడ్డి , డీజీపీ
రెసిడెన్స్ ప్రూఫ్ తప్పనిసరి..
నిత్యావసరాల కొనుగోలుకు 3 కి.మీలోపు మాత్రమే వెళ్లాలని డీజీపీ తెలిపారు. వాహనదారులు రెసిడెన్స్ ప్రూఫ్‌తోనే బయటకు రావాలని సుచించారు. ఆస్పత్రులకు వెళ్లేవారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకురావాలన్నారు. సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలని పేర్కొన్నారు. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు తేవాలిని చెప్పారు. సమర్థంగా లాక్‌డౌన్ అమలుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆశించారు.
1.21 లక్షల వాహనాలు సీజ్..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామని డీజీపీ తెలిపారు. లాక్‌డౌన్ పూర్తయ్యాక వాహనాలు కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు. ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు సీజ్ చేస్తామని డీజీపీ హెచ్చరించారు.