కరోనా విజృంభిస్తున్న వేళ మాస్క్ ధరించకుండా సంచరించే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలంటూ కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉల్లంఘనులను గుర్తించడంపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. వీరికి ఎలా జరిమానాలు విధించాలనే అంశంపై మొదట్లో తర్జనభర్జనలు పడిన ఆ శాఖ చివరికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇచ్చినట్టే ఈ-చలానా జారీచేయాలని నిర్ణయించింది.
రోజుకు పదివేలకు పైగా
ఈ నెల 5 నుంచి 11వతేదీ వరకు వారం రోజుల్లో 6 వేలకుపైగా ఉల్లంఘనులకు జరిమానా విధించింది. తర్వాత రోజు నుంచి తనిఖీలను విస్తృతం చేసింది. కూడళ్లు, ప్రధాన రహదారులు, జనసమ్మర్థ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న సిబ్బంది మాస్క్ ధరించని వారి ఫొటోలు తీస్తున్నారు. వారి ఆధార్ లేదా ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించి ఈ-చలానా రూపొందిస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం 51బి సెక్షన్ కింద జరిమానాలు విధిస్తున్నట్టు చలానాల్లో పేర్కొంటున్నారు. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ నంబరుకు ఉల్లంఘన వివరాలతో కూడిన లింక్‌ను పంపిస్తున్నారు. ఆ లింక్‌ను తెరిచి అందులోని వివరాల ఆధారంగా నెట్‌బ్యాంకింగ్ లేదా, మీసేవ కేంద్రంలో జరిమానా చెల్లించాలని సూచిస్తున్నారు.