హైదరాబాద్‌లో బాలానగర్ ఫ్లైఓవర్(FlyOver) నేడు అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా ఈ పైవంతెన(FlyOver)ను నిర్మించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఈ ఫ్లైఓవర్(FlyOver) ప్రారంభించారు. బాబూ జగజ్జీవన్ రామ్ పైవంతెనగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఫ్లైఓవర్‌తో భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెల్లు ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. నగరంలో తొలిసారిగా 6లేన్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. నిర్మాణంలో పాల్గొన్న కార్మికురాలు శివమ్మతో బాలానగర్ పై వంతెనను ప్రారంభించారు.
బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తా... రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్ , జీడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు తీర్చేందుకు ఫ్లై ఓవర్(FlyOver) నిర్మించారు.
2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 385 కోట్ల రూపాయలతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి . దీంతో నిత్యం కార్మికులు, లారీలు , ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ పైవంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు.
ట్రాఫిక్ సమస్యతో బాలానగర్ ప్రాంతంలో ప్రజలు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ పై వంతెనతో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. కూకట్‌పల్లి నియజకవర్గంలో వెయ్యి కోట్ల తో రోడ్లు, ఫ్లైఓవర్ లు నిర్మించాం. నగరంలో రవాణా వ్యవస్థ మరింత సులభ తరం చేస్తాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రహదారులను మరింత అభివృద్ధి చేస్తాం.
కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
బాలానగర్ పై వంతెన వద్ద అర కిలోమీటర్ రహదారుల విస్తరణ చేపడతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి విస్తరణ కూడా వేగంగా జరుగుతుందని... ప్యాట్ని నుంచి సుచిత్ర వరకు స్కై వేలను చేపడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకున్నా సుచిత్ర దగ్గర స్కైవే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.