హైదరాబాద్ మెట్రో ద్వారా గుండె తరలించడంపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించిన హైదరాబాద్ మెట్రో రైలు బృందాన్ని, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు కేవీబీ రెడ్డిని అభినందించారు.
మెట్రో బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ మెట్రో రైలు బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య గుండెను తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ప్రశంసించారు.
అవయవదాత నర్సిరెడ్డి కుటుంబానికి మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో హృదయపూర్వక అభినందలు తెలిపారు. నర్సిరెడ్డి మరణించినా.. మన మధ్యే బతుకున్నారని అన్నారు. ఓ ప్రాణాన్ని కాపాడేందుకు కృషిచేసిన వాళ్లందరినీ మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన్మృతి చెందిన నర్సిరెడ్డి గుండెను దానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి గుండె మార్పిడి చేయాల్సి ఉండగా.... ఆస్పత్రి వర్గాలు మెట్రోను సంప్రదించాయి. 21 కిలోమీటర్ల దూరం మెట్రోలో తీసుకెళ్లేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌లోని మెట్రో స్టేషన్‌కు గుండెను అంబులెన్స్‌లో తీసుకొచ్చి అక్కడి నుంచి మెట్రోలో జూబ్లీహిల్స్ స్టేషన్ వరకు తరలించారు. అక్కడి మెట్రోస్టేషన్ నుంచి అపోలో ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు.