సాంకేతిక విప్లవం సామాన్యులకు ఎన్నో ప్రయోజనాలు అందించిన ప్రస్తుత తరుణంలో, ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ సేవలు పొందాలంటే.. ఆఫీసుల చుట్టూ తిరగాలనీ.. సుదీర్ఘ కాలం పాటు నిరీక్షించాల్సిందేనని.. తెలంగాణ ఇన్పర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పేర్కొన్నారు. అలాంటి సేవలకు టెక్నాలజీని అన్వయించి.. సేవలు సులభతరం చేయవచ్చని.. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని, వాటిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. సర్కార్ ప్రవేశపెట్టిన నూతన రెవిన్యూ చట్టంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, రెవిన్యూ సేవల్లో మెజారిటీ పనులు డిజిటలైజేషన్ విధానంలో అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు.
కొత్త రెవెన్యూ చట్టం విప్లవాత్మక నిర్ణయం : టీటా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం అమలు నిర్ణయం.. ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలకు నాంది అని తెలంగాణ ఇన్పర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల అన్నారు. కీలకమైన రెవెన్యూ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం ఆహ్వానింరచదగ్గ నిర్ణయం అని.. ప్రజలందరికీ మేలు జరిగేలా సర్కార్ సంస్కరణలు చేపట్టిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని శాఖల్లో ఆన్లైన్ విధానాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జియో ట్యాగింగ్, ట్రాన్సాక్షన్ల ఆధారితంగా వెంటనే వివరాల మార్పు వంటివి విప్లవాత్మకమైన చర్యలు అని సందీప్ మక్తాల స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలు వినియోగించి వేగవంతమైన, అవినీతి లేని, సులభమైన, పారదర్శక సేవల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో భూముల అమ్మకం, కొనుగోలు జరిగిన వెంటనే యజమాని వివరాలు మారిపోవడం, రిజిస్ట్రేషన్ కోసం నేరుగా స్లాట్ బుకింగ్ విధానం, మ్యుటేషన్ ప్రక్రియ కోసం నెలల తరబడి నిరీక్షణకు స్వస్తి పలకడం వంటి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఉపశమాన్ని కలిగిస్తాయన్నారు. టెక్నాలజీ ఆధారంతో వేగం, కచ్చితత్వంతో అందించే సేవల వల్ల మరింత పారదర్శకత పెరుగుతుందని సందీప్ మక్తాల అభిప్రాయం వ్యక్తం చేశారు. రెవెన్యూ విభాగంలో అమలు చేస్తున్నట్లే మరిన్ని విభాల్లో ప్రజల కోసం టెక్నాలజీని వినియోగించి సేవలు సులభతరం చేయాలని, ప్రభుత్వ విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచేలా టీటా తరఫున సహాయ సహకారాలు అందజేస్తామని సందీప్ మక్తాల ప్రకటించారు.
ఇదీ చూడండి:-'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్ఈ చేతిలో లేదు'