పుర ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో మరోమారు ఎన్నికల వాతావరణం రానుంది. పురపాలక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టవిరుద్ధంగా ఎన్నికల ముందస్తు ప్రక్రియ సాగుతోందంటూ దాఖలైన వ్యాఖ్యలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. వార్డుల విభజన, ఇతరత్రా ప్రక్రియలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గతంలో స్టే ఇచ్చింది. వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చిన నేపథ్యంలో సింగిల్ జడ్జి వద్ద ప్రస్తావించి ఎన్నికల నిర్వహణపై ఉన్న స్టేను తొలగించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు
న్యాయ సంబంధిత ప్రక్రియ పూర్తైన వెంటనే ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మిగతా ఏర్పాట్లను పూర్తి చేయనుంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం యూనిట్‌గా కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. జిల్లా, నగర పాలక సంస్థ యూనిట్‌గా వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కోర్టుకు తెలిపింది. రిజర్వేషన్లను ప్రకటించి ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందించాల్సి ఉంటుంది.
షెడ్యూల్‌కు కసరత్తు
పురపాలక శాఖ నుంచి రిజర్వేషన్ వివరాలు అందిన వెంటనే వీలైనంత త్వరగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. సన్నాహాలు, మిగతా ఏర్పాట్లను పూర్తి చేసుకుని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. కొత్త పురపాలక చట్టం ప్రకారం రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీకాలం ఇంకా ముగియలేదు. మిగతా పది కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల పదవీకాలం ఇంకా ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రిలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదు. జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో విలీనం చేసిన కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ఇంకా పూర్తికాలేదు. ఆ కారణాల వల్ల అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించలేరు. మిగిలిన 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: 28న శుభవార్త చెబుతారని ఆశిస్తున్నాం: హైకోర్టు