తెలంగాణలో సంక్షేమ గురుకులాలు(Telangana Gurukul Schools Reopened) గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో వీటిని మూసేశారు. తాజాగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సొసైటీలు కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 21 నుంచి ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకులాల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని, విద్యార్థుల రక్షణ, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్.. ప్రాంతీయ, జోనల్, జిల్లా సమన్వయకర్తలకు ఆదేశాలు జారీచేశారు. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది నూరుశాతం పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించారు. పాఠశాల/కళాశాలకు వచ్చే విద్యార్థులకు కరోనా పరీక్ష తప్పనిసరి కాదని స్పష్టంచేశారు. సాధారణ శరీర ఉష్ణోగ్రత సహా ఇతర లక్షణాలు పరిశీలించాలని సూచించారు. సిలబస్ పూర్తిచేయాలనే భావనతో విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని, విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఉన్న అవగాహనను అంచనా వేస్తూ.. అందుకు అనుగుణంగా బోధన కొనసాగించాలని తెలిపారు. చాలాకాలం తరువాత విద్యార్థులు వస్తున్నందున విద్యాలయాల్లో ఒత్తిడిలేని వాతావరణం కల్పించాలని బోధన సిబ్బందికి సూచించారు.
మార్గదర్శకాలివీ
- పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- గురుకులాల సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి. గ్యాస్, కూరగాయల సరఫరా సిబ్బంది శరీర ఉష్ణోగ్రతలను గేటువద్దే తనిఖీ చేయాలి. వారితో వ్యక్తిగత దూరం పాటించాలి.
- ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాని విద్యార్థుల ప్రగతిని పరిశీలించి, ఆ మేరకు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయాలి.
- జలుబు, జ్వరం లాంటి లక్షణాలున్న పిల్లలకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించాలి. సంబంధిత సమాచారాన్ని వెంటనే పనేషియా కేంద్రానికి తెలియజేయాలి.
- పాఠశాలలో అనారోగ్యానికి గురయ్యే విద్యార్థుల కోసం ఐసొలేషన్ గది సిద్ధం చేయాలి.