Covid Tests in Telangana : పెరుగుతున్న కొవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని.. నిర్ధరణ పరీక్షలను గణనీయంగా పెంచాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోజుకు సుమారు 40వేల చొప్పున నిర్వహిస్తున్న పరీక్షలను లక్ష వరకూ పెంచాలని యోచిస్తోంది. ఇంటి వద్దనే యాంటీజెన్ పరీక్షలు చేసుకోడానికి అనుమతివ్వడంతో.. ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు, ఇళ్ల వద్ద చేసుకునే పరీక్షలు కలుపుకొని రోజుకు లక్షకు పైగానే నిర్ధరణ పరీక్షలను నిర్వహించే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
45-50% ఒమిక్రాన్ కేసులే..
One Lakh Covid Tests in Telangana : ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సుమారు 40-50 శాతం వరకూ ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు ఉన్నట్లు వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి అతి వేగంతో వ్యాప్తి చెందే గుణం ఉండడంతో.. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నాయి. దీన్ని అరికట్టాలంటే విస్తృతంగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
2 కోట్ల ర్యాపిడ్ కిట్లు..
One Lakh Covid Tests for Every Day : యాంటీజెన్ పరీక్షల ద్వారా వెంటనే ఫలితం వచ్చే అవకాశాలుండడంతో.. 2 కోట్ల ర్యాపిడ్ కిట్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. బుధవారం అన్ని జిల్లాల వైద్యాధికారులతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తదితరులు దృశ్య మాధ్యమంలో సమీక్ష నిర్వహించి, ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. గతంలో వైద్యసిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. 8 లక్షల మంది బాధితులకు కిట్లను అందించారు. ఇప్పుడూ అలా కిట్లు ఇవ్వాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం కోటి హోం ఐసొలేషన్ కిట్లను అందజేయాలని నిర్ణయించారు.
సినిమా హాళ్లలో సగం సీట్లే!
One Lakh Covid Tests for Every Day in Telangana : పండుగ సమీపిస్తుండడంతో రాకపోకలు పెరిగే అవకాశాలున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతరత్రా వాహనాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సినిమా హాళ్లు కూడా నిండుతాయి. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా సినిమా హాళ్లలో సగంమంది మాత్రమే కూర్చునేలా ఆదేశాలు జారీచేస్తే ఎలాగుంటుందనే అంశంపైనా చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని వైద్యవర్గాలు తెలిపాయి.