దిల్లీలో రెండు రోజుల పాటు సాగిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను గవర్నర్ కలిశారు. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రధాని, హోం మంత్రికి గవర్నర్ వివరించారు. కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలపై తాను రాసిన పీఎం అండ్ పీఎం పుస్తకాన్ని ప్రధానికి అందించారు.
గవర్నర్ రాసిన పీఎం అండ్ పీఎం పుస్తకంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌ని ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసిందని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. -తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
కేంద్ర కృషి మరువలేనిది..
కొవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని ప్రధానికి గవర్నర్ వివరించారు. మోదీ నేతృత్వంలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బంది కృషి చేశారని వెల్లడించారు. సలహాలు, మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా సహ అన్ని విషయాలను కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షించి.. రాష్ట్రాలకు కేంద్రం అన్నివేళలా సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు.
తెలంగాణకు, పుదుచ్చేరికి మధ్య మైత్రి...
"కరోనాను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వార్ రూంని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. ఆసుపత్రుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించింది. హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంది. తెలంగాణ ప్రభుత్వ అనుభవాన్ని పుదుచ్చేరిలో వినియోగించుకున్నాం. తెలంగాణ, పుదుచ్చేరి మధ్య మంచి అవినాభావ సంబంధాలకు ఈ కార్యక్రమం తోడ్పడింది. పుదుచ్చేరిలో కొవిడ్ నియంత్రణ ఔషధాలు అవసరమైన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సహాయ పడింది. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలను పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టాం. తాము చదువుకున్న యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థులు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రంలోని గిరిజనుల్లో ఉన్న పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు బావున్నాయి. హైదరాబాద్‌ని హరిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుంది. రాజ్‌భవన్‌లో ఇటీవల ఆత్మనిర్బర భారత్ కింద పలు కార్యక్రమాలు చేపట్టాం. ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణత గల తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్నాం." -తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇదీ చూడండి:
August 15 flag hoisting: పంద్రాగస్టున జిల్లాల్లో జెండా ఎగరేసే వాళ్లు వీరే..!