తెలంగాణ

telangana

ETV Bharat / city

చిన్నారులకు వ్యాక్సినేషన్​లో సత్తా చాటిన తెలంగాణ సర్కారు - telangana latest news

చిన్నారుల ఆరోగ్యాన్ని పదిలపరుస్తూ... పసికందులు అనారోగ్యాలు, వైకల్యాల బారిన పడకుండా కాపాడుకోవటంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సమగ్ర టీకాల కార్యక్రమం అమలులో తెలంగాణ సర్కారు అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలోనూ చిన్నారులకు వ్యాక్సిన్లు అందించటంలో అద్భుత ఫలితాలను సాధించింది.

telangana government success in vaccination to children
telangana government success in vaccination to children

By

Published : Oct 7, 2020, 8:42 PM IST

వ్యాక్సినైజేషన్... మారుతున్న కాలం, అభివృద్ధి పేరిట పెరుగుతున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి రేపటి తరాన్ని సురక్షితం చేసే గొప్ప అస్త్రం. శిశువు పుట్టినప్పటి నుంచి 15ఏళ్ల లోపు అనేక రకాల వ్యాధులకు టీకాలు ఇవ్వటం దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమం. ఈ ఇమ్యునైజేషన్​లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్టు రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

ఆగస్టు నాటికే మూడో స్థానంలో...

ఈ ఏడాది ఆగస్టు నాటికి 87.7 శాతం చిన్నారులకు టీకాలను అందించి... జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. టీకాల అమలులో ఆగస్టు నాటికి జమ్మూకశ్మీర్ 98.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా... 89.7 శాతంతో మేఘాలయ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 3 లక్షల 63 వేల 26 మంది చిన్నారులకు ఆగస్టు నాటికి టీకాలు ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో ఆగస్టు నాటికి కేవలం 65.3 శాతం మందికే టీకాలు అమలు జరగటం గమనార్హం.

టీకాలపై కరోనా ప్రభావం...

వాస్తవానికి మార్చి నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతోంది. మార్చి, జూన్ నెలల్లో సంపూర్ణ లాక్​డౌన్, వైరస్ ప్రభావాల కారణంగా ఇమ్యునైజేషన్​కి కొంత ఆటంకం ఏర్పడింది. దీంతో పీహెచ్​సీలు, సీహెచ్​సీల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు ఇవ్వటం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవటం వల్ల హైదరాబాద్ పరిసరాల్లో టీకాల అమలుపై ప్రభావం పడింది.

సర్కారు ప్రత్యేక కార్యాచరణ...

పరిస్థితి అంచనా వేసిన సర్కారు... వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేని ప్రాంతాల నుంచి పీహెచ్​సీలకు మాతా శిశువులను తరలించేందుకు 102 వాహనాలను వినియోగించటంతో పాటు... వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా ఏఎన్​ఎంలు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్​కి కేటాయించిన సమయాన్ని తెలియజేయటంతో పాటు... ప్రతి పీహెచ్​సీలో ఇమ్యునైజేషన్ యాక్షన్ ప్లాన్ కోసం ఒక సూపర్​వైజర్​ని ఏర్పాటు చేసింది. సరైన భవంతులు లేని చోట ప్రత్యేకంగా సబ్​సెంటర్లను ఏర్పాటుచేసి అక్కడే చిన్నారులకు వ్యాక్సిన్లు అందించింది.

సెప్టెంబరు చివరినాటికి 91 శాతం...

మండలాల వారీగా ఇంఛార్జిలను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు వ్యాక్సినైజేషన్​ని మానిటర్ చేయించింది. టీకాలను ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించింది. ఫలితంగా ఆగస్టు నెలలో వ్యాక్సినైజేషన్ గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీసీజీ 99 శాతం ఇవ్వగా, పెంటా వాలెంట్ 3.. 92శాతం, మీజిల్స్ రూబెల్లా 91శాతం పూర్తి చేసింది. ఆగస్టులో 87.7శాతంగా ఉన్న వ్యాక్సినైజేషన్... సెప్టెంబర్ చివరి నాటికి 91శాతానికి పెరిగింది.

99.99 శాతమే లక్ష్యంగా...

టీకాల అమలులో జాతీయ సగటు కేవలం 68.5 శాతం ఉండగా ... కొవిడ్ వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం సమగ్ర టీకాల అమలుకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ సర్కారు... అక్టోబర్ మొదటి వారానికి దాదాపు 96 శాతం టీకాల అమలును పూర్తి చేసింది. 99.99 శాతం చిన్నారులకు టీకాలను ఇవ్వటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం... అందుకోసం ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

ఇదీ చూడండి: దట్టమైన అడవుల్లో గర్భిణిని 4 కి.మీ మోస్తూ...

ABOUT THE AUTHOR

...view details