ఏపీ విభజన తర్వాత 91 వాణిజ్య పన్నుల సర్కిళ్లు, 12 డివిజన్లతో తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటైంది. ఇందులో కొన్ని సర్కిళ్లు పన్ను చెల్లింపుదారులతో చాలా చిన్నవిగా... మరికొన్ని సర్కిళ్లు మూడునాలుగు సర్కిళ్లకు సమానమైన పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పెద్దగా ఉండేవి. చిన్న సర్కిళ్లలో పని చేసే అధికారులకు చేతినిండా పనిలేక ఖాళీగా ఉండేవారు. పెద్ద సర్కిళ్లలో పనిచేసే అధికారులకు పని ఒత్తిడి తీవ్రంగా ఉండేది. ఈ పరిస్థితిని గుర్తించిన అప్పటి వాణిజ్య పన్నుల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్... సర్కిళ్లను ప్రక్షాళన చేయడం ఒకటే మార్గమని నిర్ణయించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య, అధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి, పాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రామాణికంగా తీసుకుని సర్కిళ్లను ప్రక్షాళన చేసే దిశలో పునర్విభజన చేశారు. 2018 మే 22న ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 145 ఇచ్చి ప్రక్షాళన చేపట్టారు.
సర్కిళ్లను చేసినట్లే డివిజన్ల ప్రక్షాళన
తక్కువ పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లకు ఎక్కువ మంది చెల్లింపుదార్లను కేటాయించడం, అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లలో సంఖ్యను తగ్గించడం లాంటి కార్యక్రమం చేపట్టారు. కొన్ని డివిజన్లల్లో సర్కిళ్ల సంఖ్య పెరగగా మరికొన్ని డివిజన్లల్లో సర్కిళ్ల సంఖ్య తగ్గింది. ఒక్కో డివిజన్ పరిధిలో ఏడు లేక ఎనిమిది సర్కిళ్లు ఉండేట్లు చర్యలు తీసుకున్నారు. జిల్లాల్లో అయిదు డివిజన్లు ఉండగా హైదరాబాద్ నగరంలోనే ఏడు డివిజన్లు ఉన్నాయి. సర్కిళ్లను ప్రక్షాళన చేసినట్లే... డివిజన్లను కూడా పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో 14 సర్కిళ్లు, హైదరాబాద్ రూరల్ డివిజన్ పరిధిలో 14 సర్కిళ్లు ఉండడంతో అక్కడ అధికారులపై పని ఒత్తిడి విపరీతంగా ఉంది. పాలనాపరంగానూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.