తెలంగాణ

telangana

ETV Bharat / city

Paddy Procurement: ధాన్యం కొనడమా?.. కొనిపించడమా..? - తెలంగాణ తాజా వార్తలు

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సి వస్తే ఆ వడ్లను ఏం చేయాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? కొనుగోలుకు కావాల్సిన సాధన సంపత్తి ఎంత ఉంది? తదితర అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

PADDY PROCUREMENT
grain collection in telangana

By

Published : Mar 30, 2022, 5:37 AM IST

Paddy Procurement: రాష్ట్రంలో ప్రస్తుతం వడ్ల సేకరణ కీలకాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రుల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రి గోయల్‌ను కలిసినా తగిన హామీ లభించలేదు. మరోసారి కేంద్రంతో సంప్రదింపులు జరిపితే ఎలా ఉంటుందనే దానిపైనా అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. యాసంగిలో ఎండల కారణంగా ధాన్యంలో తేమ శాతం తగ్గిపోయి మిల్లింగ్‌ సమయంలో నూకలు ఎక్కువ వస్తాయి. అందుకే యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఉగాది తర్వాత వరి కోతలు ముమ్మరం కానున్నాయి. ఆలోపు ప్రత్యామ్నాయ ప్రణాళికను ఖరారు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏంచేయాలనే దానిపై ప్రభుత్వం అన్ని మార్గాలనూ పరిశీలిస్తోంది.

కొనటమా?.. కొనిపించడమా?:ధాన్యం మొత్తాన్ని స్వయంగా కొనడమా? లేక మిల్లర్లతో కొనిపించడమా? అని యోచిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని మిల్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కనీస మద్దతు ధరకు తాము కొనలేమని మిల్లర్లు చెబుతున్నట్లు తెలిసింది. లెవీ విధానం ఎత్తివేసిన తర్వాత మిల్లర్లు సొంత పెట్టుబడి లేకుండా ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతోనే వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పుడు వారు పెట్టుబడి పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపటం లేదు. ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు కనీస మద్దతు ధర 1,980, సాధారణ రకం ధర 1,960 రూపాయలుగా ఉంది. ఇప్పటికే నిజామాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో క్వింటాకు 1,500 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారు.

ప్రత్యామ్నాయం.:ప్రస్తుత సీజన్‌లో 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఆ లెక్క ప్రకారం 60 నుంచి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి మించకపోవచ్చని అంచనా. కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొని ఈ-వేలం ద్వారా విక్రయించడం ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వగా మిగిలిన ధాన్యాన్ని ఈ-వేలం రూపంలో విక్రయిస్తోంది. బియ్యంగా మార్చి విక్రయించడం కన్నా ధాన్యంగా విక్రయిస్తేనే ప్రభుత్వంపై భారం తక్కువ పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీచూడండి:Silkworm Rearing: పట్టు పురుగుల పెంపకం.. స్వయం ఉపాధితో ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details