తెలంగాణ

telangana

ఆ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం... తెలుగు భాషకు ప్రమాదం

By

Published : Apr 4, 2022, 7:51 AM IST

Govt junior colleges: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా 150 చోట్ల ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తెలుగు భాషకు గండం ఏర్పడినట్లేనని తెలుగు భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

govt junior colleges
govt junior colleges

Govt junior colleges: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత విద్యా సంవత్సరమే దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు సబ్జెక్టుకు ముప్పు తప్పదన్న ఆందోళన తెలుగు భాషాభిమానుల నుంచి వ్యక్తమైంది. ఆ క్రమంలో చర్యలు నెమ్మదించినా మళ్లీ తాజాగా ఇంటర్‌ విద్యాశాఖ రాష్ట్రంలో 150 కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ప్రమాదంలో తెలుగు భాష...

రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా...ఇప్పటికే 13 చోట్ల ద్వితీయ భాషగా ఆ సబ్జెక్టు అమలవుతోంది. తాజాగా మరో 150 కళాశాలల్లో అవసరమని ఇంటర్‌ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఒక్కో కళాశాలలో ఒక పోస్టు చొప్పున 150 సంస్కృతం అధ్యాపకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదించింది. ఇంటర్‌లో విద్యార్థులు ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా తెలుగు/ఉర్దూ/హిందీ/అరబిక్‌/సంస్కృతం చదువుతున్నారు. మొత్తం కళాశాలల్లో కనీసం 350కిపైగా కళాశాలల్లో తెలుగునే ఎంచుకుంటున్నారు.

ప్రభుత్వం సంస్కృతాన్ని బలోపేతం చేయాలని భావించి ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెడుతోంది. ఇది వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచే అమలు కావొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల తెలుగు భాష ప్రమాదంలో పడినట్లేనని తెలుగు భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. అధిక మార్కుల కోసం ప్రభుత్వమే మాతృభాషను కాదని ఇతర భాషను ప్రోత్సహిస్తే ఎలా అన్న ప్రశ్న వారి నుంచి వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details