Discom losses in telangana:తెలంగాణలో విద్యుత్తు సరఫరా చేస్తున్న ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)లు భారీగా నష్టాలను చవిచూస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2016-20 మధ్య కాలంలో ఈ సంస్థలకు వాటిల్లిన నష్టాలు రూ.26,254 కోట్లు అని, అందులో రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంటూ నిధులను విడుదల చేసింది. ఆ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కంకు రూ.6,228 కోట్లు, వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కంకు రూ.2,697 కోట్లు జమచేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఎందుకీ సాయం...:రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ఇతర వెనకబడిన వర్గాల కోసం అమలుచేసే రాయితీ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించే కరెంటుకు నెలనెలా బిల్లులు చెల్లించకపోవడంతో వాటి బకాయిలు పేరుకుపోతున్నాయి. డిస్కంలు ఏటా నష్టాలను చవిచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఉంది. వాటిని ఆదుకునే లక్ష్యంతో 2015లో ‘ఉజ్వల్ డిస్కం హామీ యోజన’(ఉదయ్) పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే డిస్కంలకు వచ్చే నష్టాల్లో కొంత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఏటా ఆ శాతం పెంచుతూ పోవాలి. ఆ ప్రకారం 2016-17లో డిస్కంలకు వచ్చిన నష్టాల్లో 5 శాతం, 2017-18 తాలూకూ నష్టాల్లో 10 శాతం, 2018-19లో 25 శాతం, 2019-20లో 50 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఆ నిబంధనల ప్రకారం గత నాలుగేళ్ల(2016-20) కాలానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నష్టాల శాతాలను లెక్కగట్టి రూ.8,925 కోట్లు విడుదల చేయాలంటూ ట్రాన్స్‌కో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ఇంధనశాఖ తెలిపింది.