తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2022, 8:40 AM IST

ETV Bharat / city

ఆ ఆసుపత్రుల్లో... ఇక మందుల్లేవనే మాట రావద్దు.!

రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో మందులు లెేవనే మాట రాకుండా పరిస్థితిన చక్కదిద్దడంపై దృష్టి సారించింది. పీహెచ్‌సీ నుంచి బోధనాసుపత్రుల వరకూ ప్రస్తుత అవసరాలను బట్టి అదనపు ఔషధాలను చేర్చింది. ఈ ఏడాది నుంచే కొత్తమందుల జాబితాను అమలుచేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది.

Medication list
Medication list

సర్కారు దవాఖానాల్లో ఔషధాలు అందుబాటులో లేవనే మాట రాకుండా పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఔషధ జాబితాలో మార్పులు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) నుంచి బోధనాసుపత్రుల వరకూ దవాఖానాల ప్రస్తుత అవసరాలను బట్టి కొత్తగా మందులను చేర్చింది. ప్రస్తుత అత్యవసర ఔషధ జాబితా (ఎసెన్షియల్‌ మెడిసన్‌ లిస్టు-ఈఎంఎల్‌)లో 338.. అదనపు ఔషధ జాబితా(ఏఎంఎల్‌)లో 382 మందులు.. మొత్తం 720 మందులుండగా వాటి సంఖ్యను 843కు పెంచింది. ఇందులో ఈఎంఎల్‌ జాబితాను 311గా నిర్ణయించింది. తమిళనాడులో కూడా ఈఎంఎల్‌ జాబితాలో ఇన్నే మందులున్నాయి. అందుకే అదేవిధానాన్ని తెలంగాణలోనూ అనుసరించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ మందులన్నింటినీ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే కొనుగోలు చేసి, ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేస్తుంది. ఏఎంఎల్‌ మందులను 532కు పెంచింది. ఈ జాబితాలోని మందుల్లో 313 టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కొనుగోలు చేస్తుంది. మిగిలిన 219 ఔషధాలను బోధన, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులే అవసరాలకు తగ్గట్లుగా కొనేలా వెసులుబాటు కల్పించింది. దీనిపై ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

30 వైద్య విభాగాల కసరత్తు

మందుల జాబితాను పక్కాగా రూపొందించేందుకు.. వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 30 వైద్య విభాగాల నుంచి ఇద్దరు చొప్పున స్పెషలిస్టు వైద్యులు ఇటీవల పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఆయా స్పెషాలిటీల్లో అవసరమైన 1200 రకాల ఔషధాలతో జాబితా రూపొందించారు. దీన్ని నిమ్స్‌ ఫార్మకాలజీ విభాగం వైద్యులు వడబోశారు. తమిళనాడు ఔషధ జాబితాతో సరిపోల్చి... వారి జాబితాలోని మందులను అలాగే ఉంచి... వేర్వేరు పేర్లతో ఒకే ఔషధ గుణమున్న మందులను జాబితా నుంచి తొలగించారు. స్పెషలిస్టు వైద్యులు సూచించిన ఔషధాల్లో కొన్నింటిని అదనంగా చేర్చారు. దీంతో 123 రకాల మందులు జాబితాలో కొత్తగా చేరాయి.

ఏఎంఎల్‌ జాబితాలో తక్కువ మోతాదులో వినియోగమయ్యే వాటిని ఎంపికచేసి.. వాటిని స్థానికంగా ఆసుపత్రులే కొనుగోలు చేసేలా మార్పు చేశారు. శస్త్రచికిత్స అనంతరం తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదురైతే ఇచ్చే ఒక యాంటీబయాటిక్స్‌ ఇంజెక్షన్‌ను తక్కువ సందర్భాల్లో వినియోగించాల్సి వస్తుంది. ఇలాంటివి ఒక ఆసుపత్రిలో ఏడాదికి 1000 కూడా అవసరం పడవు. ఇలాంటి ఇంజక్షన్లను ఆసుపత్రే కొనుగోలు చేసుకుంటుంది.

50:30:20 నిష్పత్తిలో...

బోధనాసుపత్రుల సంఖ్య పెరిగిన దృష్ట్యా... మొత్తం ఔషధ బడ్జెట్‌లో 50 శాతం నిధులను వీటికే కేటాయించారు. 30 శాతం టీవీవీపీ పరిధిలోని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు.. 20 శాతం నిధులను ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కేటాయించారు. ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి వికేంద్రీకరణ నిధులనూ సవరించారు. బోధనాసుపత్రులకు 20 శాతం.. టీవీవీపీ ఆసుపత్రులకు 10 శాతం.. ప్రజారోగ్య సంచాలకులకు 5 శాతం చొప్పున కేటాయించారు. అంటే బోధనాసుపత్రులకు కేటాయించిన మొత్తం రూ.250 కోట్లలో రూ.50 కోట్లు స్థానికంగా ఆసుపత్రుల్లో కొనుగోలుకు వెళ్తాయి. పీహెచ్‌సీలలో స్థానికంగా కొనుగోలు చేయాల్సి వచ్చే మందులకు కేటాయించిన 5 శాతం నిధులను రాష్ట్ర స్థాయిలో ప్రజారోగ్య సంచాలకుల వద్ద నిల్వ ఉంచుతారు. ఆన్‌లైన్‌ విధానంలో మందులు వినియోగం ఎప్పటికప్పుడూ తెలుసుకుంటారు. మూణ్నెల్ల మందులు ఎప్పుడూ నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details