18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ అందజేసే కార్యాచరణపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రుల్లోనే టీకాలను అందజేస్తే.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంపై సమాలోచనలు చేస్తోంది. 45 ఏళ్లు దాటిన వారితోపాటు అదనంగా 18 ఏళ్లు దాటిన వారు కూడా ప్రైవేటులో టీకాలు పొందాల్సి వస్తే.. కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు ఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రైవేటులో రద్దీ
రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వారికి టీకాలను అందజేస్తున్నారు. వచ్చే మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారికి టీకాల పంపిణీని ప్రైవేటుకే పరిమితం చేస్తే.. పరిస్థితి ఏమిటనే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వాధ్వర్యంలో ఈ వయసు వారికి కూడా టీకాలు అందించాలంటే.. అందుకయ్యే ఆర్థిక భారాన్ని రాష్ట్ర సర్కారే భరించాలి. దీనిపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగలేదు. ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహిస్తే.. వాటిల్లో రద్దీ పెరిగే అవకాశాలున్నాయి. రద్దీని నివారించడానికి కొవిడ్ చికిత్సలతో సంబంధం లేకుండా ప్రత్యేక కేంద్రాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.