తెలంగాణ

telangana

ETV Bharat / city

Harish Rao About Budget 2022-23 : 'కొత్తగా ఏర్పడినా.. తెలంగాణ దేశానికే ఆదర్శం' - బడ్జెట్ గురించి హరీశ్ రావు

Harish Rao About Budget 2022-23 : కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించని ప్రగతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లలో చేసి చూపించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. బడ్జెట్​పై అసెంబ్లీలో చర్చకు సమాధానం ఇచ్చారు. కొత్తగా ఏర్పడినా కూడా తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

Harish Rao About Budget 2022
Harish Rao About Budget 2022

By

Published : Mar 9, 2022, 4:28 PM IST

Harish Rao About Budget 2022-23 : కొత్తగా ఏర్పడినా చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం, ఆర్బీఐ లెక్కలే రాష్ట్రాభివృద్ధిని చెబుతున్నాయని తెలిపారు. జీఎస్​డీపీ రూ.11.54 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు పెరిగిందని వివరించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఉద్ఘాటించారు.

Harish Rao in Assembly 2022 : "కాంగ్రెస్‌ పార్టీ గాంధీజీ పేరు చెప్పుకుని 50 ఏళ్లు ఓట్లు వేయించుకుంది. గాంధీజీ చెప్పిన గ్రామస్వరాజ్యాన్ని మాత్రం కాంగ్రెస్‌ సాధించలేదు. కాంగ్రెస్‌ 60 ఏళ్లల్లో సాధించని అభివృద్ధిని మేం 6 ఏళ్లల్లో సాధించాం. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మేం స్వీకరిస్తాం. కాంగ్రెస్‌ హయాంలో రైతులు బోర్లు వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు.. తాగునీరు, విద్యుత్ రావట్లేదని ప్రతిపక్షాలు అడగట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. పంటలు ఎండిపోయాయని ఎవరూ అడగట్లేదంటే అర్థం ఏమిటీ? ప్రతి గ్రామంలో నర్సరీలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం. గతంలో ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లోనూ కరెంట్‌ ఉండేది కాదు. తెలంగాణ వచ్చేనాటికి 7750 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 17,800 మెగావాట్ల విద్యుత్‌ అందిస్తున్నాం. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి తాగునీటి సమస్య పరిష్కరించాం."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

Harish Rao About Telangana Schemes : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. కేసీఆర్‌ కిట్‌ పథకానికి కోసం రూ.1700 కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. రైతులకు రైతుబంధు కింద రూ.54 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. రైతుబంధును కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా అమలుచేస్తున్నామని ఉద్ఘాటించారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.75వేల కోట్లు అందాయని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు.

"రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదు. మీటర్లు పెడితేనే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం చెప్పింది. మీటర్లు పెడితే ఇచ్చే ప్రోత్సాహకాలు వద్దని చెప్పాం. రైతుల ఉసురుపోసుకుంటేనే వచ్చే ప్రోత్సాహకాలు అవసరం లేదని చెప్పాం. కేంద్రం పెట్టే కండీషన్లకు కొన్ని రాష్ట్రాలు ఒప్పుకొని ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకున్నాయి. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ చివరి నుంచి ఐదోస్థానంలో ఉంది. మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు 23 ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ పరిమితికి లోబడే తెలంగాణ అప్పులు ఉన్నాయి. ఇటీవల కేంద్ర విధానాల వల్లే రాష్ట్రాల అప్పులు పెరిగాయి. ఉదయ్‌ పథకం కింద డిస్కమ్‌లు అప్పులను రాష్ట్రాల ఖాతాలో వేశారు."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

కొత్తగా ఏర్పడినా.. తెలంగాణ దేశానికే ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details