తెలంగాణ

telangana

ETV Bharat / city

రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఆమోదం - తెలంగాణ రెవెన్యూ బిల్లు

మట్టి పిసుక్కునే రైతులను కాపాడాలని... లంచాలు ఇచ్చే బాధ తప్పాలనే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ బిల్లు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పునరుద్ఘాటించారు. ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని భరోసానిచ్చారు. 16,137 భూ వివాదాలు ఉన్నాయని రెండు మూడు నెలల్లో వాటిని పరిష్కరించే వరకే రెవెన్యూ కోర్టులుంటాయని సీఎం వెల్లడించారు. వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా లాక్ చేశామని సీఎం తెలిపారు.

kcr
kcr

By

Published : Sep 14, 2020, 4:52 PM IST

Updated : Sep 14, 2020, 11:11 PM IST

రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఆమోదం

పూర్తి స్థాయిలో భూ వివాదాలు సమసిపోవాలనే ఉద్దేశంతో కొత్త రెవెన్యూ బిల్లు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. భూ వివాదాలు లేని దేశాల్లో 2 నుంచి మూడు జీడీపీ పెరిగిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా భూముల ధరలు పెరిగాయని.. ఎక్కడ కూడా ఎకరా రూ.10లక్షలకు తక్కువ పలకడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ మాఫియా, నకిలీ స్టాంప్ పేపర్లు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని.. వాటి నుంచి ప్రజలను రక్షించేందుకే కొత్త రెవెన్యూ బిల్లును తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ భూమి హక్కులు-పట్టాదారు బిల్లు, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు బిల్లును శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. వీటితో పాటు తెలంగాణ పురపాలక శాసనాల సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.

రైతులను రక్షించాలనే ఉద్దేశంతో

భూమి ఒకప్పుడు కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండేదని.. ఇప్పుడు అందరి చేతుల్లోకి వెళ్లిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతును రక్షించాలనే ఉద్దేశంతోనే కౌలుదారు విషయాన్ని పట్టించుకోవడం లేదని వివరించారు. 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారన్నారు. ఏ ఆస్తికి లేని అనుభవందారు కాలం భూమికే ఎందుకుండాలని ప్రశ్నించారు. అందుకే ఆ కాలం తొలగించామన్నారు. వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నామని... వారు దుర్మార్గానికి పాల్పడ్డారని అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వీఆర్వోలను తొలగించకుండా.. ఇతర శాఖల్లో తీసుకుంటామని పేర్కొన్నారు. ఏజెన్సీ భూముల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐల భూములను రక్షించే బాధ్యత తీసుంటామని హామీ ఇచ్చారు.

త్వరలో ప్రారంభిస్తాం

కొత్త రెవెన్యూ బిల్లు కోసం మూడున్నరేళ్లుగా కసరత్తులు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. సర్వే ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాదిలో సర్వే పూర్తవుతుందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఒక్కొక్క పీఠముడి విప్పుతున్నామన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు వందశాతం లాభం జరుగుతుందని భరోసా ఇచ్చారు. మంచి రోజు చూసి ధరణి పోర్టల్​ను ప్రారంభిస్తామన్నారు. ధరణి పోర్టల్​ను పబ్లిక్ డొమైన్​లో ఉంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పోర్టల్ చూసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. చాలా పారదర్శకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం తహసీల్దార్లకు సైతం లేదని తేల్చిచెప్పారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ఫొటోతో సహా అన్ని వివరాలు నమోదుచేస్తేనే... ధరణి పోర్టల్‌లో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. 7 మండలాలను ఏపీలో కలిపి, మోదీ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వత నష్టం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు.

వాళ్లు అవకాశాలను కోల్పోతారు

75వేల వక్ఫ్ బోర్డు భూముల్లో 55వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు. దేవాదాయ, వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా, కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని కోరారు. వీఆర్వోలను రద్దు చేసి... వేరే శాఖకు బదిలీ చేయడం వల్ల 6వేల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యవస్థను సరిగా రద్దు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని... అందుకోసం ఆ అంశాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరారు. వీఆర్వోలకు మాత్రమే అవినీతి ముద్ర వేయకుండా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. రెవెన్యూలో ఏ అధికారి అవినీతికి పాల్పడ్డా శిక్షకు అర్హుడు కావాలన్నారు. 10 నుంచి 12 లక్షల రైతులకు పట్టాదారు పాస్ బుక్​లు లేవని... భూ వివాదాలు అప్పీల్ చేయకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారి సమస్యలు పరిష్కారించాలని ఆయన డిమాండ్ చేశారు.

రేపటికి వాయిదా

గురుకులాలు, స్వతంత్ర సమరయోధులు, ఆర్మీ అధికారుల భూముల వివాదాలు పరిష్కరించాలని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు సూచించారు. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని అంతం చేయాలని సూచించారు. తెలంగాణ భూమి హక్కులు - పట్టాదారు బిల్లు, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు బిల్లు, తెలంగాణ పురపాలక శాసనాల సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులు శాసన పరిషత్ ఆమోదం పొందాయి. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.

ఇదీ చదవండి:టీఎస్‌ బీపాస్‌ బిల్లుకు శాసనసభ ఆమోదం

Last Updated : Sep 14, 2020, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details