తెలంగాణ

telangana

ETV Bharat / city

GO 111 Withdrawal : జీవో 111 ఎత్తివేత.. దీని కథేంటో తెలుసుకుందామా..

GO 111 Withdrawal : ఒకప్పుడు గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరేవి. ఇప్పుడు కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడం వల్ల జంట జలాశయాలపై ఎక్కువగా ఆధారపడటం లేదు. అందుకే జీవో 111ను ఎత్తివేయడం లేదా.. పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున కీలక ప్రకటన చేశారు. జీవో 111ను ఎత్తివేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

GO 111 Withdrawal
GO 111 Withdrawal

By

Published : Mar 16, 2022, 7:06 AM IST

GO 111 Withdrawal : జంట జలాశయాల పరిరక్షణకు గతంలో జారీ చేసిన జీవో 111 ఎత్తివేస్తామని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సానుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా ఉండగా.. ఇంకొందరు మధ్యేమార్గాన్ని సూచిస్తున్నారు. జీవో 111 ఎత్తివేయదల్చుకుంటే.. ఆ ప్రాంతం వరకు ప్రత్యేకమాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలంటున్నారు.

ఇది అసలు కథ :

GO 111 Withdrawal in Telangana : హైదరాబాద్‌ నగర శివారులోని గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం.192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది.

  • క్యాచ్‌మెంట్‌ పరిధిలో వేసే లేఅవుట్లలో 60శాతం ఓపెన్‌ స్థలాలు, రోడ్లకు వదలాలి.
  • వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్‌ కోసం కేటాయించాలి. ఇందుకుగాను హుడా బాధ్యత వహించాలి.
  • రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి.
  • జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.

ఉన్నత స్థాయి కమిటీ వేసినా.. :

GO 111 Withdrawal in Hyderabad : ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరేవి. రానురానూ కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడటం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల జీవో 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ జీవోపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమావేశం కాలేదని గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఛైర్మన్‌ పద్మనాభరావు చెబుతున్నారు. గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో గతంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నుంచి నివేదిక రాకపోవడంతో మరికొంత సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ నేపథ్యంలోనే జీవో 111పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన వెలువడింది.

ABOUT THE AUTHOR

...view details