Voter Card Photo Similarity : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 22 లక్షల ఫొటో సిమిలర్ ఎంట్రీల(ఒకే ఫోటోతో పలు ఓటర్ ఐడీలు) పరిశీలనా కార్యక్రమం కొనసాగుతోందని... రాజకీయపార్టీలతో పాటు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన సీఈఓ... ప్రక్రియను వివరించి వారితో చర్చించారు. పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రంలోని పలు నియోజవర్గాల్లో పెద్దఎత్తున ఫొటో సిమిలర్ ఎంట్రీలు ఉన్నందున ప్రక్రియ పకడ్బందీగా చేయాలని... బీఎల్ఓలనే కాకుండా పైస్థాయి అధికారులను జవాబుదారీ చేయాలని పార్టీలు సూచించాయి.
డూప్లికేట్ ఓట్ల పేరిట అసలు ఓటర్లను తొలగించవద్దని పార్టీ నేతలు కోరారు. కేవలం పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గ పరిధికి మాత్రమే పరిశీలనను పరిమితం చేయకుండా అన్ని నియోజకవర్గాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ సిమిలర్ ఎంట్రీల పరిశీలన చేయాలని కొన్ని పార్టీల ప్రతినిధులు సూచించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రక్రియ ప్రారంభమైందని, జీహెచ్ఎంసీలోనూ త్వరలో ప్రారంభం అవుతుందని సీఈఓ తెలిపారు. రాజకీయ పార్టీల సలహాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పరిశీలనా ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా బీఎల్ఓలు, అధికారులకు ఆదేశాలిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓట్ల తనిఖీకి అధిక సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ఓట్ల తనిఖీ వేగంగా పూర్తి చేయమని చెప్పామని... తనిఖీలకు ఎలాంటి గడువు విధించలేదన్నారు.