Telangana Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఆమోదం అంశమే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశమవుతోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దుపై చర్చించి.. ఆమోదించేందుకు రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై సాయంత్రం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
మంత్రులకు దిశానిర్దేశం..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో పాటు బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాలను మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించనున్నారు. 2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అయిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ, అమలు తీరుతెన్నులపై అమాత్యులకు వివరిస్తారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో విపక్షాలను ఎదుర్కోవడం, వారు లేవనెత్తే అంశాలకు దీటైన సమాధానాలు ఇవ్వడం, స్పందించడంలాంటి అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం, మన ఊరు - మన బడి ప్రారంభం, యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ సహా ఇతర అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.