రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్పై సమావేశంలో చర్చించనున్నారు. లాక్‌డౌన్ (Lockdown) గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కొనసాగించాలా.. లేదా.. అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడిప్పుడే కొవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుతున్న తరుణంలో మరికొన్నాళ్ల పాటు లాక్‌డౌన్ కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లాక్డౌన్పై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. అటు ఇంటింటి జ్వర సర్వే, కొవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
టీకాలపై జరగనున్న చర్చ
రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. టీకాల కార్యక్రమంపైనా భేటీలో చర్చ జరగనుంది. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపైనా సమీక్షిస్తారు. అటు నీటిపారుదల అంశాలపైనా కేబినెట్లో చర్చిస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం అంచనాలు, చెక్ డ్యాంలు సంబంధిత అంశాలపై చర్చిస్తారు.