లాక్డౌన్ పొడిగింపుపై కేబినెట్ భేటీ - telangana lockdown
14:03 June 08
కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ లాక్ డౌన్ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో... జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించి, లాక్ డౌన్, మినహాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. కొవిడ్ మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధత, ఏర్పాట్లపై చర్చించనున్నారు. రేపు 19 డయోగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభం విషయమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
వానాకాలం పంటల సాగు, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతి సహా సంబంధిత అంశాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతుబంధు సాయం పంపిణీ, విత్తనాలు, బయో ఫెర్టిలైజర్స్ నియంత్రణ కోసం చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం పడిపోయిన వేళ ఆర్థిక స్థితిగతులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
నిధుల సమీకరణ, భూముల విక్రయం లాంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణ అమలు, సంబంధిత అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణ, విద్యా సంబంధిత అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.