రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల బిల్లుకు.. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమల్లోకి వస్తే... రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌లు, మ్యుటేషన్, పాస్‌బుక్‌ల జారీ సహా సమస్త రెవెన్యూ వ్యవహారాల్లో అవినీతికి ఆస్కారం ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వేతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మరోసారి సాదాబైనామా
సాదాబైనామాలకు మరోసారి అవకాశమిస్తున్నట్లు సీఎం తెలిపారు. జీవో 58, 59 కాలపరిమితి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వక్ఫ్, ఎండోమెంట్ భూముల్లో ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే వక్ఫ్ భూములపై లావాదేవీలు నిషేధిస్తున్నట్టు తెలిపారు. అనంతరం కొత్త రెవెన్యూ చట్టం సహా.... వీఆర్వో పదవుల రద్దు, పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
వారి పరిస్థితి ఏంటి..?
తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల బిల్లు-2020, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020, తెలంగాణ పురపాలక చట్టం, పంచాయతీరాజ్ 2020 సవరణ బిల్లులపై శాసనసభలో సమగ్ర చర్చ జరిగింది. ఈ బిల్లులపై చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్... సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ మేరకు.. కొత్త చట్టం అమల్లోకి వస్తే మురికివాడల్లో నోటరి భూములు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
సర్వే చేయకపోతే సమస్యలు
సమగ్ర భూ సర్వే చేయకపోతే నూతన రెవెన్యూ చట్టంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భూమిపై అనుభవదారునికి కూడా హక్కు కల్పించాలని, ధరణి పోర్టల్ సహా మాన్యువల్‌గా రికార్డులు కొనసాగించాలని సూచించారు. కొత్త బిల్లులో రికార్డింగ్ అథారిటీని ప్రస్తావించలేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు... పేర్లు, వివరాల నమోదులో అక్షర దోషాలను ఎవరు సరిచేస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తహసీల్దార్, ఆర్డీవోలవద్ద నమోదుకాని... రికార్డుల అంశాన్ని పరిశీలించాలని కోరారు.
ఆరంభం మాత్రమే
తెలంగాణలోని అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని... తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. అనంతరం చర్చకు సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్... ఒక్కో ప్రశ్న, సూచనలకు వివరణలు ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో కొత్త రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమేనని చెప్పారు. సమగ్ర సర్వేతో వివాదాలన్నింటికీ చరమగీతం పాడతామని, ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తామని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాసు పుస్తకాలు, వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపురంగు పాస్ పుస్తకాలు ఇస్తామని పేర్కొన్నారు.
తప్పు చేస్తే ఉద్యోగం పోతుంది
రెవెన్యూ కోర్టులను కొనసాగించే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. కౌలుదారి వ్యవస్థను పట్టించుకోబోమన్నారు. అటవీ భూముల్లో రాజకీయదందాలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌లో అటవీ భూములకు ప్రత్యేక కాలం ఏర్పాటుచేసి ఆర్వోఎఫ్‌ఆర్ భూముల లబ్ధిదారుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని తెలిపారు. అధికారులు తప్పుచేస్తే... ఉద్యోగం నుంచి తొలగించే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచినట్టు స్పష్టంచేశారు. అనంతరం మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తరువాత సభను సోమవారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి:జంతువులపై కొవాగ్జిన్ సత్ఫలితాలిచ్చింది: భారత్ బయోటెక్