శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Sessions 2021) శుక్రవారం ముగియనున్నాయి. శాసనసభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీసీల కులగణన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని పక్షాల మద్దతు కోరనున్నారని తెలుస్తోంది. మండలిలో పల్లె, పట్టణ ప్రగతి అంశంతోపాటు స్టాంపుల చట్టం సవరణ బిల్లుపై చర్చించనున్నారు. శుక్రవారం నాటికి అన్ని బిల్లులకు ఆమోదం లభించనుండటంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చలు పూర్తవుతున్నందున సమావేశాలను ముగించనున్నారు. దీనిపై శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌లు శాసనసభాపక్ష నేతలతో గురువారం చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మండలిలో వీటిపై చర్చ
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై మండలి(Telangana Legislative Council)లో చర్చ జరగనుంది. సౌర-పవన విద్యుత్, పత్తి సేకరణ, భారీ వర్షాలతో పంటనష్టం, ఎస్టీలుగా వాల్మీకీలు, రాష్ట్ర వృద్ధిపై నీతిఆయోగ్ ప్రశంస అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విధానం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం, ఎఫ్సీఐ ద్వారా బియ్యం కొనుగోళ్లు, పట్టణ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం అంశాలు మండలిలో(Telangana Legislative Council) ప్రశ్నోత్తరాల్లో చర్చించనున్నారు. స్టాంపుచట్టం సవరణ బిల్లుపై కౌన్సిల్(Telangana Legislative Council)లో ఇవాళ చర్చ జరగనుంది. ఇవాళ్టితో వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. సమావేశాల ముగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉభయసభలను ఇవాళ నిరవధికంగా వాయిదా వేయవచ్చని సమాచారం.