TDP decision on Assembly sessions: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా ? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన తెదేపా శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు.
సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత పార్టీలో చర్చ జరిగింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.
అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతాం..
రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీఎల్పీ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. చట్టసభలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలతోనూ చర్చించేవాళ్లని.. మూడేళ్లుగా విపక్ష సభ్యులకు చట్టసభల్లో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఒంటెత్తుపోకడలతో ముందుకెళ్తోందని అచ్చెన్న మండిపడ్డారు.